Viral Video:


కాలువలో నోట్ల కట్టలు 


బిహార్‌లోని ససరం ప్రాంతానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు కాలువలో కరెన్సీ నోట్లు ఏరుకుంటూ వాటిని బయటకు తీస్తున్నారు. మోరాదాబాద్‌ ఏరియాలో ఉన్న ఓ కాలువలోకి కొంత మంది దిగారు. కట్టలు కట్టలు కరెన్సీ నోట్లు తీసుకుని బయటకు వస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 20 మంది ఆ కాలువలో ఉన్నారు. ఓ వృద్ధుడైతే రెండు చేతుల్లో నోట్లు తీసుకుని మురిసిపోయాడు. పరిగెత్తుకుంటూ నీళ్లలో నుంచి వచ్చేశాడు. రూ.100,రూ.200, రూ.500,రూ.2000 నోట్లు దొరికినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అయితే...అక్కడ నోట్ల కట్టలు ఎలా వచ్చాయన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. ఎక్కడి నుంచి ఈ నోట్లు వచ్చాయనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అక్కడి గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం...తెల్లవారుజామున కరెన్సీ నోట్ల కట్టలున్న బస్తాలు నీళ్లలో కనిపించాయి. ఇది చూసి ఒక్కసారిగా జనాలు అక్కడ గుమిగూడారు. మురికి నీళ్లు అని కూడా చూడకుండా లోపలికి వెళ్లిపోయి వాటిని ఒడిసి పట్టుకున్నారు. ఇవి నకిలీ నోట్లు అని కొంత మంది కొట్టి పారేసినా...గ్రామస్థులు మాత్రం అవి నకిలీ నోట్లు కాదని తేల్చి చెప్పారు. నకిలీ నోట్లు కూడా కానప్పుడు అంత డబ్బుని కాలువలో ఎందుకు పారేశారన్నది తేలాల్సి ఉంది.