ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి వరదలు పోటెత్తాయి. ఏకంగా రోడ్లకు రోడ్లే కొట్టుకుపోతున్నాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేహ్రాదూన్- రాణిపొఖారీ-రిషికేశ్ హైవేపై ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం కూడా వరదల ధాటికి తుడిచిపెట్టుకుపోయింది.


దేహ్రూదూన్-రిషికేశ్ ను కలిపే రాణిపొఖారీ వంతెనలో ఓ భాగం కూలిపోవడంతో వాహనాల రాకపోకల కోసం ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే వరదల ధాటికి ఇది కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఓ వాహనం కూడా నీటిలో వరదలకు కొట్టుకుపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.






వరుణ బీభత్సం..


ఉత్తరాఖండ్ లో కొద్ది రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావిత ప్రాంతమైన జుమ్మా గ్రామంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పిథోర్ గఢ్ జిల్లాలో వర్షాల ధాటికి ఇళ్ల గోటలు బీటలు వారాయి.


పిథోర్ గఢ్ జిల్లాలోని జుమ్మా గ్రామంలో ఇటీవల వరదల కారణంగా ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. 22 కుటుంబాల వరకు ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. 






ప్రజలు ఎవరూ ఎలాంటి ప్రయాణాలు చేయకుండా ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో నదులు పొంగిపొర్లుతున్నాయి.