Himachal Pradesh:
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి కంగ్రా జిల్లాలోని చక్కీ బ్రిడ్జ్ కూలిపోయింది. ఆగకుండా కురుస్తున్న వానలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేషనల్ హైవే -5 ని మూసివేశారు. హమీర్‌పూర్‌లో 22 మంది వరదలో చిక్కుకున్నారు. కొన్ని జిల్లాల్లో స్కూల్స్‌ని మూసివేశారు. మరి కొన్ని గంటల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. చంబా, కంగ్రా, మండీ, హమీర్‌పూర్, బిలాస్‌పూర్, ఉన, షిమ్లా, సోలన్ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. మండీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. షాపులు, ఇళ్లు వరదల ధాటికి కొట్టుకుపోతున్నాయి. రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. బల్హ్, సదర్, తునాగ్, మండీ, లమతక్ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అప్రమత్తమైంది. "చాలా ప్రాంతాల నుంచి మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలా మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. సాధ్యమైనంత వరకూ వారిని రక్షిస్తున్నాం. పోలీసులతో పాటు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తోంది" అని పోలీసులు వెల్లడించారు. మండీ, కులు ప్రాంతాల్లో పాఠశాలల్ని బంద్ చేశారు. కాలేజ్‌లు మాత్రం నడుస్తున్నాయి. నేషనల్ హైవే-5ని క్లోజ్ చేశామని అధికారులు వెల్లడించారు.