తెలంగాణలో కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య ఎలక్షన్ ఫైట్ ముగిసింది. కానీ కొత్తగా పేపర్ ఫైట్ ప్రారంభమైంది. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బీఆర్‌ఎస్ పాలనపై శ్వేత పత్రం విడుదల చేసింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కాళేశ్వరం ద్వారా కమీషన్లు సంపాదించారని ఎప్పటి నుంచో కాంగ్రెస్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు గుప్పించింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా కట్టారని అందుకే కుంగుబాటుకు అది గురైందని విమర్శలు చేశారు.
రాష్ట్ర ఆర్థిక తీరు తెన్నులను ప్రజల ముందు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని ద్వారా బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడం, వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్పు సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీలో పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే తీరున ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల తీరు తెన్నులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించేందుకు సిద్ధమైంది.
కలర్ పేపర్‌తో బీఆర్ఎస్ పార్టీ.
రాష్ట్ర పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో అందకు దీటుగా బీఆర్ఎస్ సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాకముందే గులాబీ పార్టీ 51 పేజీలతో కలర్ పేపర్ విడుదల చేసింది. అందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చేసిన అప్పులు, వాటిని వినియోగించిన తీరు, ఆస్థులు పెంచిన తీరు, వ్యవసాయం, పెరిగిన పంటల సాగు వివరాలు, పంటల ఉత్పత్తి, నూతన ఆస్పత్రుల నిర్మాణం, గురుకులాల పెంపు, పశు, మత్స్య సంపద పెంపు వంటి గణాంకాలు ఉంచింది. చేసిన ప్రతీ రూపాయి అప్పునకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేయి రూపాయల ఆస్థి కూడబెట్టినట్లు పేర్కొంది. 2014లో రాష్ట్ర జీఎస్డీపీ 5.5 లక్షల కోట్లు ఉంటే 2023 నాటికి 13.13 లక్షలకు పెంచినట్లు తెలిపింది. 159.6 శాతం జీఎస్డీపీని బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినట్లు ఆ పత్రంలోవివరించింది.
2014లో తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు ఉంటే, 2023లో తలసరి ఆదాయం 3,12,398 రూపాయలకు పెంచినట్లు ఇది151.7 శాతం పెరుగుదలగా బీఆర్ఎస్ తన కలర్ పేపర్ లో పేర్కొంది. ఆదాయం విషయానికి వస్తే 2014లో సెల్స్ టాక్స్ 27,200 కోట్లు ఉంటే, 2023 నాటికి72,564 కోట్లకు పెంచామని, ఇది 161 శాతం వృద్దిగా, రిజిస్ట్రేషన్ల ఆదాయం విషయానికి వస్తే 2014లో 2,832 కోట్లు మాత్రమే ఉండగా, 2023 నాటికి 14,291 కోట్లకు పెంచామని ఇది 406 శాతం వృద్ధిగా బీఆర్ఎస్ విడుదల చేసిన పత్రంలో వివరించింది.
వీటితో పాటు మిషన్ కాకతీయ పథకం ద్వారా 21,663 చెరువులు పునరుద్ధరించి, 15.05 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినట్లు, 617 కోట్లతో నూతన సచివాలయ నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా వందకువంద శాతం అన్ని గ్రామాలకు, పట్టణాలకు సురక్షిత తాగు నీరు అందించడం వంటి పనులు చేసినట్లు తన విడుదల చేసిన పత్రంలో బీఆర్ఎస్ పేర్కొంది.
వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల సాగు విస్తీర్ణం రాష్ట్రం ఏర్పడిన నాడు 1, 31,34,000 ఎకరాలు ఉండే అది నేడు నుం 1,98,37,000 ఎకరాలకు పెంచినట్లు పత్రంలో వివరించింది. 49,63,068 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రం ఏర్పడిన నాడు వరి సాగు జరుగుతుంటే, 2023 నాటికి సాగు విస్తీర్ణం 97,97, 785 ఎకరాలకు పెరిగింది. అంటే 97 శాతం సాగు విస్తీర్ణం పెరిగినట్లు తెలిపింది. పంటల ఉత్పత్తులు 2014లో 99,33,471 మెట్రిక్ టన్నుల నుండి 2023 నాటికి 2,48,65,662 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు తెలిపింది. పత్తి, కందులు వంటి పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు వివరించింది.
శాఖల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టుసహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, వాటి వ్యయం, ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమానికి చేసిన ఖర్చు,విద్య,వైద్య శాఖల కేటాయింపుల పెంపు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం, పోలీసు శాఖ ఆధునీకరణ, పచ్చదనం 81.81 చదరపు కిలోమీటర్ల పెంపు, 13 వేల ఎకరాల్లో 19,472 ప ల్లె ప్రకృతి వనాల ఏర్పాట్లు హెచ్ఎండీ పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లాకుల ఏర్పాటు 1200 కోట్లతో యాదాద్రి పునర్మిర్మాణం, 2800కోట్లతో ఆలయాల అభివృద్ధి, ఆరోగ్య శాఖలో 34 వేల హస్పిటల్ బెడ్ల పెంపు, 34000 ఆక్సిజన్ పడకలు, 80 ఐసూ కేంద్రాలు ,82 డయాలసిస్ కేంద్రాలు, 500 బస్తీ దవాఖానాల ఏర్పాటు, వేయి పడకలతో అల్వాల్ టిమ్స్, ఎర్రగడ్డలో ఆసుపత్రి, గడ్డి అన్నారం, 1261 బెడ్స్తో గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం 3779 కోట్లతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వంటి పలు అంశాలను తన కలర్ పేపర్ ప్రజెంటేషన్ లో బీఆర్ఎస్ వివరించింది.
ఒక్క మాటలో చెప్పాలంటే పదేళ్లలో చేసిన పనులు, వాటి గణాంకాలు, వృద్ధి రేటు, ఆస్థులు, మౌలిక సదుపాయల కల్పన, సంక్షేమ కార్యక్రమాల వంటి వాటితో ఈ పత్రం విడుదలైంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ప్రారంభం కాకముందే బీఆర్ఎస్ హయంలో జరిగిన కార్యక్రమాలు, ప్రభుత్వ పాలనపై చర్చజరిగేలా బీఆర్ఎస్ వ్యూహాత్మంగా ఈ కలర్ పేపర్ విడుదల చేసింది.