Putin Flu Vaccine: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునే వ్యాక్సిన్ షాట్‌ను తీసుకున్నారు. ఈ మేరకు రష్యన్ వార్తా సంస్థ TASS పేర్కొంది.


రష్యా శానిటరీ చీఫ్ దేశంలో ప్రబలుతున్న శ్వాస సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్ లకు సంబంధించిన నివేదిక అందించిన తర్వాత ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పుతిన్  మాట్లాడుతూ "నేను నిన్న వాక్సిన్ తీసుకున్నాను. నేను నా సహచరులందరికీ కూడా సలహా ఇచ్చాను. నేను ఈ రోజు రోజులాగే ఆటలు ఆడాను. అంత సాధారణంగా ఉంది."అని తెలిపారు.


ఉక్రెయిన్‌ యుద్ధంతో టెన్షన్‌లో ఉన్న రష్యా నెత్తిన ఇప్పుడు ఫ్లూ సమస్య వచ్చిపడింది. రష్యాలో మరోసారి ఫ్లూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అధ్యక్ష భవనంలోని అధికారులకు కూడా ఈ అంటువ్యాధి సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను బంకర్‌లోని ఐసోలేషన్‌కు తరలించినట్లు సమాచారం.


డేంజర్


రష్యాలో ఫ్లూ వ్యాప్తి ఎక్కువైనట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. చాలా మంది అధికారులు కూడా ఫ్లూ బారినపడటంతో పార్లమెంటు ఎగువసభలో ప్రసంగానికి పుతిన్‌ దూరంగా ఉండనున్నారని క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కాసేపటికే అధ్యక్షుడు పుతిన్‌ను పౌరులకు దూరంగా ఉంచేందుకు బంకర్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో భారీ స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు రష్యా ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



ఈ ఏడాది ఫ్లూ వ్యాప్తి భారీగా ఉండనుంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ వేరియంట్‌ ఫ్లూ రకానికి చెందినదే. 2009లో మహమ్మారిగా అవతరించిన ఫ్లూ A (H1N1) రకానికి చెందింది. ఇటువంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు కనిపించిన వెంటనే ఇంటికే పరిమితం కావాలి. వీటితోపాటు మాస్కులు ధరించడంతోపాటు ముఖం, చేతులు, శ్వాసకోశ భాగాలను శుభ్రంగా ఉంచుకోవాలి.                         "
- అన్నా పొపోవా, రష్యా ఆరోగ్య నిపుణురాలు  






ఇటీవల


ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్ గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల పుతిన్ గురించి షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి పుతిన్ (70) జారిపడినట్లు న్యూయార్క్‌ పోస్టు వెల్లడించింది.


పుతిన్ మెట్లు దిగుతుండగా కాలు జారడంతో ఐదు మెట్లకు కింద పడిపోయినట్లు తెలిపింది. దీంతో పుతిన్‌ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొంది. దీనికారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అయితే దీనిపై క్రెమ్లిన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


పుతిన్‌ రక్షణ సిబ్బందితో సన్నిహిత సంబంధాలున్న ఓ టెలిగ్రామ్‌ ఛానెల్‌ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా న్యూయార్క్‌ పోస్ట్‌ ఉటంకించింది.


Also Read: Rafales Landed In India: చైనా గుండెల్లో గుబులు- భారత్ చేరుకున్న చివరి రఫేల్!