Vizianagaram News: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నుంచి మూడు రోజులపాటు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు రాజాం నియోజకవర్గానికి ఆయన రానున్నారు. రెండో రోజు బొబ్బిలి, మూడో రోజు విజయనగరం నియోజకవర్గంలో పర్యటిస్తారు. కార్యకర్తలతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున తరల వచ్చేలా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఈనెల 23న బొబ్బిలి పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి చించివేశారు. ప్రస్తుతం ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. 


బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి బైపాస్ రోడ్డు జంక్షన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నట్లు సీఐ నాగేశ్వర రావు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. కఠిన చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు.  






గత జూన్ లో జిల్లాకు వచ్చిన చంద్రబాబు..


టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గత జూన్ నెలలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరంల్లో పర్యటించారు. ఆరు నెలల తర్వాత మరోసారి జిల్లాకు వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బహిరంగ సమావేశాలు, రోడ్ షో తో పాటు వివిధ వర్గాలతో మమేకమయ్యేలా కార్యాచరణ రూపొందించారు. చంద్రబాబు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళంలోని చిలకపాలెం, రాపాక జంక్షన్, పొందూరు మీదగా రాజాం మండలం పొగిరి చేరుకొంటారు. 4. 30 గంటలకు వీఆర్ ఆగ్రహం వద్ద ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:30 గంటలకు చైతన్య జూనియర్ కళాశాల వద్ద రోడ్ షో నిర్వహిస్తారు. 


24వ తేదీన బొబ్బిలి రైతులతో బాబు ముఖాముఖి..


6 గంటలకు మోర్ సూపర్ మార్కెట్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 7:45 గంటలకు ఆర్సీఎం చర్చిలో నిర్వహించే మినీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాత్రి 9.30 గంటలకు రాజాంలోని తృప్తి రిసార్ట్ కు చేరుకొని అక్కడ బస చేస్తారు. 23న రాజాంలో ఓబీసీ వర్గాలు, 24న బొబ్బిలిలో రైతులతో ముఖాముఖి కానున్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న, చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులు రెండు రోజులుగా జిల్లాలోనే ఉండి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు.