Viral Video:


నీళ్లలో పడి కొట్టుకుపోయిన ఫ్యామిలీ..


వీకెండ్‌లో సరదాగా సేదతీరాలని పర్యాటక ప్రదేశాలకు వెళ్లిపోతుంటారు చాలా మంది. టూరిస్ట్ ప్లేస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది వాటర్ ఫాల్స్. మన చుట్టు పక్కల ఎక్కడ జలపాతాలు ఉన్నాయో వెతుక్కుని మరీ అక్కడికి వెళ్తుంటాం. వాటర్ ఫాల్స్ ఇచ్చే ఆనందం అలాంటిది. కాసేపు ఆ నీళ్ల కింద ఆడుకుంటూ అన్ని టెన్షన్లు మర్చిపోతారు. ఆ నీళ్లు మనకు ఎంత ఆనందాన్నిస్తాయో...ఒక్కోసారి అవే మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అందుకే...జలపాతాలు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా...ప్రాణాలు పోగొట్టుకోక తప్పదు. ఫిలిప్పైన్స్‌లో అదే జరిగింది. 2021లో జరిగిన ఈ  ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కొందరు పర్యాటకులు వాటర్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపటి వరకూ బానే ఉన్నా...ఉన్నట్టుండి నీళ్ల ప్రవాహం పెరిగింది. ఏం జరుగుతోందో
వాళ్లకు అర్థం కాలేదు. నీళ్లు చాలా వేగంగా దూసుకొచ్చాయి. తేరుకుని జాగ్రత్త పడేలోగా అందరూ ఆ నీళ్లలో పడి కొట్టుకుపోయారు. నార్తర్న్ కెబూలోని కాట్‌మాన్ టౌన్‌లో టినుబ్దన్ వాటర్ ఫాల్స్ వద్ద జరిగిందీ ప్రమాదం. ట్విటర్‌లో ఓ యూజర్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. పాతదే అయినా...ఇప్పుడూ వైరల్ అవుతోంది. ఇప్పటికే 20 లక్షల మంది చూశారు. వేలాది మంది లైక్‌ చేశారు. 3 వేల మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియోకి "మీ సోషల్ మీడియాలోని లైక్స్ కన్నా మీ జీవితం చాలా విలువైంది" అని క్యాప్షన్ ఇచ్చాడు. నిజానికి చాలా మంది ఇలాంటి వాటర్ ఫాల్స్ వద్ద రకరకాల సాహసాలు చేస్తూ ఫోటోలు దిగుతుంటారు. వీడియోలు తీస్తారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైక్‌లు లెక్కేసు కుంటారు. ఈ ఉద్దేశంతోనే ఆ యూజర్ అలా క్యాప్షన్ పెట్టి మరీ అందరినీ అలెర్ట్ చేశాడు. చాలా మంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. "మీరున్న ప్లేస్‌లో వాటర్ ఫాల్స్ బాగానే కనిపిస్తాయి. కానీ...పై ప్రాంతంలో ఎక్కడైనా వర్షం పడితే నీళ్ల ప్రవాహం పెరుగుతుంది. ఇది గమనించుకోకపోతే ప్రాణాలు కోల్పోతారు. తస్మాత్ జాగ్రత్త" అని ఓ నెటిజన్ హెచ్చరించాడు. "ఈ దుర్ఘటనలో కుటుంబం అంతా నీళ్లలో కొట్టుకుపోయింది" అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.