Earthquake in New York: మార్చి 5వ తేదీన న్యూయార్క్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ తీవ్రత 4.8గా నమోదైంది. అయితే...ఈ ప్రకంపనల సమయంలో Statue of Liberty ఒక్కసారిగా ఊగిపోయింది. ఈ స్టాచ్యూపై పెట్టిన సర్వైవలెన్స్ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నిజానికి న్యూయార్క్‌లో భూ ప్రకంపనలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రకంపనలు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం వణికిపోయారు. లక్షలాది మంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. న్యూయార్క్‌తో పాటు ఫిలడెల్ఫియా ప్రాంతంలో భారీ బిల్డింగ్‌లన్నీ ఊగిపోయాయి. ఆస్తినష్టం వాటిల్లకపోయినా ఉన్నట్టుండి భారీ భవనాలన్నీ ఊగిపోవడం కలకలం సృష్టించింది. గత శతాబ్ద కాలంలో ఈ స్థాయిలో ఎప్పుడూ న్యూయార్క్‌లో భూకంపం రాలేదని గవర్నర్ వెల్లడించారు. ఈ భూకంపం సమయంలో ఓ మెరుపు కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తాకినట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.  Dan Martin అనే ఓ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో తీశారు. లిబర్టీ చేతిలోని టార్చ్‌ని ఈ మెరుపు తాకినప్పుడు ఈ ఫొటో క్యాప్చర్ చేశాడు. 




దాదాపు 4.7 కిలోమీటర్ల లోతు వరకూ ఈ భూ ప్రకంపనల తీవ్రత కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం నమోదు కాకపోయినా పౌరులందరూ జాగ్రత్త వహించాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్ గవర్నర్‌తో మాట్లాడారు. ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే సాయం అందించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మన్‌హట్టన్‌లోని ఐక్యరాజ్య సమితి హెడ్‌క్వార్టర్స్‌లో ఇజ్రాయేల్-గాజా యుద్ధంపై చర్చ జరుగుతుండగా ఒక్కసారిగా కెమెరాలు ఊగిపోయాయి. ఈ వీడియోలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.