మాల్‌లో మతప్రార్థనలకు అనుమతించం..
లక్నోలోని లూలూ మాల్‌లో కొందరు ముస్లింలు నమాజ్ చేయటం వివాదాస్పదమైంది. షాపింగ్ మాల్‌లో మత ప్రార్థనలను ఎలా అనుమతిస్తారంటూ షాపింగ్ మాల్ యాజమాన్యంపై పలువురు మండిపడుతున్నారు. అటు యాజమాన్యం మాత్రం తాము అన్ని మతాలనూ గౌరవిస్తామని, మతపరమైన కార్యకలాపాలకు మాల్‌లో అనుమతినివ్వలేమని స్పష్టం చేసింది. మాల్‌లో పని చేసే సిబ్బందే నమాజ్ చేశారని, ఇలాంటి మరోసారి జరగకుండా జాగ్రత్తపడతామని వెల్లడించింది. అయితే యాజమాన్యం వివరణ ఇచ్చేలోగా ఇది కాస్తా వివాదమైంది. మాల్‌లో నమాజ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చాక, అఖిల భారతీయ హిందూ మహాసభకు చెందిన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాల్ బయట నిరసన చేపట్టారు. మాల్ ఎదురుగా సుందర కాండ చదివేందుకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు.
ఇది కచ్చితంగా లవ్ జీహాద్ కుట్రే..
"ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు మాల్ యాజమాన్యం అనుమతినిచ్చింది. అలాంటప్పుడు హిందువులు కూడా లోపల ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతినివ్వాలి" అని అఖిల భారతీయ హిందూ మహాసభ ప్రతినిధి ఒకరు డిమాండ్ చేశారు. మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించామని, యాజమాన్యం తమను అడ్డుకుందని ఆరోపించారు. మాల్‌పై ఫిర్యాదు కూడా చేసింది హిందూమహాసభ. మాల్‌లో పని చేసే వారిలో 70% మంది ముస్లింలే ఉన్నారని, లవ్ జీహాద్‌లో భాగంగానే ఇలాంటి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అటు మాల్ యాజమాన్యం కూడా స్పందించింది. నమాజ్ చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. అబుదాబీకి చెందిన లూలూ గ్రూప్‌నకు కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరులో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. లక్నోలో ఇటీవలే మాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జులై10వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లూలూ గ్రూప్ ఛైర్మన్, భారత సంతతికి చెందిన బిలియనీర్ యూసుఫ్ అలీ కూడా హాజరయ్యారు.