Viral Video Impact : సోషల్ మీడియా ప్రస్తుత కాలంలో ఓ ప్రధాన అస్త్రం. దానిని వినియోగించే రీతిలో అది ఉపయోగపడుతోంది. మంచికి వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనడానికి ఉదాహరణ ఈ ఘటన. బిహార్ కు చెందిన ఓ 10 ఏళ్ల దివ్యాంగ బాలిక, ఒంటి కాలుతో పాఠశాలకు వెళ్లే వీడియో ఇటీవల వైరల్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా ఆమెకు వరంగా మారింది. బాలిక వీడియోను చూసిన వాళ్లు చలించిపోయారు. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలా ఓ దాత బాలికకు కృత్రిమ కాలు అమర్చారు. బిహార్‌లోని జముయి జిల్లాకు చెందిన సీమ అనే పదేళ్ల బాలిక రెండేళ్ల క్రితం తన కాలును కోల్పోయింది. కాలు కోల్పోయినా తన సంకల్పాన్ని కోల్పోలేదు. నిత్యం ఒంటికాలుతో కుంటుకుంటూ బాలిక పాఠశాలకు వెళ్లేది. 






బాలిక వీడియో వైరల్ 


కొన్ని రోజుల క్రితం బాలిక పాఠశాలకు వెళ్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన జాముయి జిల్లా మేజిస్ట్రేట్ అవనీష్ కుమార్, పలువురు ఇతర సీనియర్ అధికారులు ఫతేపూర్ గ్రామానికి వెళ్లి, ఆమె పాఠశాలకు వెళ్లేందుకు ట్రై సైకిల్‌ అందించారు. అయితే బిహార్ ప్రభుత్వం, నటుడు సోనూ సూద్ కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. “ఇప్పుడు ఆమె ఒకటి కాదు రెండు పాదాలపై దూకి పాఠశాలకు వెళుతుంది. రెండు కాళ్లపై నడవాల్సిన సమయం ఆసన్నమైంది" అని సోనూ సూద్ ట్వీట్ చేశారు. సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అవసరమైన వారికి సహాయం చేస్తున్నారు. 






స్వాతి లక్రా ట్వీట్ 


సీమాకు కృత్రిమ కాలు వచ్చింది, అని ఆమె చిత్రాలను ఐపీఎస్ అధికారి అధికారి స్వాతి లక్రా పంచుకున్నారు. "సోషల్ మీడియా సానుకూల శక్తి ధన్యవాదలు. సీమా ఒక కాలు కోల్పోయి పాఠశాలకు వెళ్లవలసి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లే వీడియో వైరల్ కావడంతో కృత్రిమ కాలు అందుకుంది. ఆమె ఇప్పుడు రెండు కాళ్లపై నిలబడి ఉంది" అని లక్రా ట్వీట్ చేశారు.  జముయి కలెక్టర్ అశ్వని శరణ్ కూడా కృత్రిమ కాలుతో ఉన్న సీమా ఫోటోను పంచుకుంటూ సోషల్ మీడియా శక్తిని ప్రశంసించారు.