Violence Erupted Again in Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్(Manipur) లో మరోసారి హింస చెలరేగింది. తౌబాల్ జిల్లా లిలాంగ్ చింగ్ జావో (LilangChingjao) ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీస్ దుస్తుల్లో వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి. దీంతో తౌబాల్ తో పాటు ఇంఫాల్ ఈస్ట్ (Imphal East), ఇంఫాల్ వెస్ట్ (Imphal West), కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. బాధితులను ఆస్పత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని, పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. 


దోపిడీకి వచ్చి


స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వద్ద డబ్బులు దోచుకునేందుకే దుండగులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కార్లలో వచ్చిన నిందితులు ఘర్షణకు దిగగా, స్థానికులు వారిని తరిమికొట్టారు. అయితే, పారిపోతూ వారు కాల్పులు జరిపినట్లు చెప్పారు. కార్లను అక్కడే వదిలి నిందితులు పరారీ కాగా, స్థానికులు ఆగ్రహంతో వారి కార్లను తగలబెట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ప్రభుత్వం ప్రభావిత జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. మరోవైపు, ప్రజలు సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ఘటనపై లిలాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ సైతం స్పందించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఆ ప్రాంతంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 


పోలీస్ వాహనంపైనా


కాగా, 3 రోజుల క్రితం మణిపూర్ లో పోలీస్ కమాండోలపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. తెంగ్ నౌపాల్ జిల్లాలోని మోరేలో శనివారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. భారత్ - మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన మోరే నుంచి కీలక ప్రాంతాలకు వెళ్తున్న పోలీస్ కమాండో వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధులు కాల్పులు జరిపినట్లు చెప్పారు.


మణిపూర్ లో గతేడాది మే 3న ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మొయితీలుండగా, నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకూ ఉంటారు. 


Also Read: India Corona Cases: భారత్‌లో 197కు చేరిన జేఎన్1 కేసులు, తాజాగా 636 మందికి కోవిడ్