ఢిల్లీ: దేశంలో కొవిడ్‌-19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 కేసులు (Subvariant JN1 Cases) క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసుల సంఖ్య 197కు చేరింది. అత్యధికంగా ఒక్క కేరళలోనే 83 మందిలో జేఎన్ 1 పాజిటివ్ గా నిర్ధారించారని ‘ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG)’ తెలిపింది. దేశంలో  ఇప్పటివరకు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో JN1 Subvariant కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒడిశాలో ఒక జేఎన్‌1 పాజిటివ్‌ కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 


నవంబర్ లో తొలి కేసు నిర్ధారణ 
భారత్ లో తొలిసారిగా నవంబర్‌లో జేన్1 కేసులు గుర్తించారు. నవంబర్ లో 17 కేసులు నమోదుకాగా, డిసెంబర్‌లో 180 మందికి జేఎన్ 1 పాజిటివ్ నిర్ధారించినట్లు INSACOG వెల్లడించింది. దేశ వ్యాప్తంగా జేఎన్ 1 సబ్ వేరియంట్ కేసులు 197 కి చేరగా దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో 83, కర్ణాటకలో 8 మందికి, తమిళనాడులో నలుగురిలో నిర్ధారించారు. తెలంగాణలో ఇద్దరికి జేఎన్ 1 పాజిటివ్ గా తేలింది. గోవా, గుజరాత్ లోనూ జేఎన్ 1 తీవ్రత పెరుగుతోంది. గోవాలో ఇప్పటివరకూ 51 మందికి, గుజరాత్ లో 34 మందికి జేఎన్1 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒడిశాతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ ఒక్కటి చొప్పున జేఎన్1 కేసులు నమోదయ్యాయి.


ఆందోళన అక్కర్లేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ 
గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 636 మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపితే భారత్ లో మొత్తం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కు చేరింది. జనవరి 2020లో కరోనా వ్యాప్తి చెందినప్పటి నుండి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,12,484కి చేరుకుంది. COVID-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 55,33,358కి పెరిగింది.


జేఎన్ 1 వేగంగా వ్యాప్తి చెందుతున్నా ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలు, నిబంధనలు పాటిస్తే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని, కేసులు అదుపులో ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలని, వీలైతే భౌతిక దూరం పాటించాలని అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు