Vijayawada Deaths News: రౌడీ షీట‌ర్ ఆత్మహ‌త్య చేసుకున్నాడు.. అత‌ని అంత్యక్రియ‌ల్లో పాల్గొన్న ఫుడ్ బాల్ ప్లేయ‌ర్ సాయంత్రానికి హ‌త్యకు గుర‌య్యాడు. ఈ వ్యవ‌హ‌రం బెజ‌వాడ‌లో సంచ‌ల‌నంగా మారింది. పోలీసులతో పాటుగా క్లూస్ టీం రంగ‌లోకి దిగింది. ప్రత్యేక బృందాలు ఈ వ్యవ‌హ‌రంపై ద‌ర్యాప్తు మొదలు పెట్టారు.


వాంబే కాల‌నీకి చెందిన రౌడీ షీటర్ ఓయబాను శంకర్ అలియాస్ టోనీ అనుమానాస్పద స్థితిలో అత‌డి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టోని  స్థానికంగా ఉండే మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇక్కడ మ‌రో ట్విస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియ‌ల్లో పాల్గొన్న జక్కంపూడికి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాష్, సాయంత్రానికి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ రెండు ఘటనలు ఒకే రోజు జరగడంతో స్థానికంగా సంచలనంగా మారింది.


టోనీ అంత్యక్రియల్లో జ‌రిగిన వివాదం నేప‌థ్యంలోనే ఫుట్ బాల్ ప్లేయర్ హ‌త్య జ‌రిగిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆకాష్‌తో టోనీ అనుచ‌రులు మార్చురీ స‌మీపంలో ఉన్న ఒక‌ బార్ వ‌ద్ద గొడ‌వ ప‌డ్డారు. ఆ తర్వాత ఆకాష్ ను, గురునాన‌క్‌ కాల‌నీలోని స్నేహితుడి అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లి క‌త్తుల‌తో దాడి చేసి హ‌త‌మార్చారు. ఉద‌యం రౌడీ షీట‌ర్ ఆత్మహ‌త్య, ఆ త‌రువాత కొద్ది సేప‌టికి అత‌ని స్నేహితుడిగా ఉన్న ఫుడ్ బాల్ ప్లేయ‌ర్ దారుణ హ‌త్యకు గురి కావ‌టం వెనుక బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయ‌నే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


ఇప్పటికే గంజాయి బ్యాచ్‌తో పాటుగా డ్రగ్స్ వంటి కేసులు పోలీసుల‌కు స‌వాల్ గా మారాయి. ఈ నేపథ్యంలో రౌడీషీట‌ర్ ఆత్మహ‌త్య, ఆ త‌రువాత మ‌రో హ‌త్య జ‌ర‌గ‌టం చూస్తుంటే బెజ‌వాడలో క్రైం రేటుతో పాటుగా, శాంతి భ‌ద్రత‌ల‌కు సంబంధించిన అంశాలపై ప్రభావం చూపుతుందని ఖాకీలు భావిస్తున్నారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై నున్న, ప‌ట‌మ‌ట పోలీసులు కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.