Vijayawada News: ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలా ఫ్రీగా పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చు, పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు.. జస్ట్ అలా ఓ లైక్ కొడితే చాలంటూ వల విసిరారు సైబర్ నేరగాళ్లు. ఇది నిజమనుకున్న ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి లైకులు కొట్టడం ప్రారంభించింది. ముందుగా లైక్ కొట్టినప్పుడల్లా 150 రూపాయలు డిపాజిట్ చేశారు. డబ్బులు పెట్టి లైక్ కొడితే ఆ డబ్బును డబుల్ చేస్తామన్నారు. ఎలాగే డబ్బులు వస్తున్నాయనుకొని.. లక్షల్లో డబ్బులు పెడతూ లైకులు కొడుతూ వెళ్లింది. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి బావురుమంటోంది. 


అసలేం జరిగిందంటే..?


విజయవాడ నగరానికి చెందిన ఓ యువతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. అయితే ఓ రోజు ఆమె మొబైల్ ఫోన్ కు ఓ సందేశం వచ్చింది. పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ అధికంగా డబ్బులు సంపాదించవచ్చని.. వివరాలకు సంప్రదించండి అని ఫోన్ నెంబర్ ను కూడా ఇచ్చారు. అయితే ఆమె ఆ నెంబర్ కు ఫోన్ చేయగా.. యూట్యూబ్ లో వీడియోలను లైక్ చేస్తే చాలని.. అన్నింటికీ లెక్కగట్టి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు.


సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో పాటు ఇది కూడా చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని ఆశ పడింది. అన్నింటికీ ఒప్పుకొని తన బ్యాంకు ఖాతా వివరాలను ఇచ్చింది. ఆ తర్వాత మూడు వీడియోలు లైక్ చేసినందుకు ఆమె ఖాతాలో రూ.150 జమ అయింది. మరో ఆరు వీడియోలను కూడా లైక్ చేయగా.. రూ.300 ఖాతాలో వేశారు. ఆమెకు నమ్మకం కుదిరేలా చేసిన తర్వాత.. ప్రీపెయిడ్ టాస్కులుచేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. పెట్టుబడి అని.. దానికి లాభం వస్తుందని చెప్పడంతో ఆమె సరేనన్నారు. అలా మొదట వెయ్యి రూపాయలు చెల్లిస్తే తిరిగి 1600 ఆమెకు వచ్చాయి. ఇలా ఆమె విడతల వారీగా 19 లక్షలు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు పంపించింది. 


అయితే లాభం వస్తుందని చూపుతున్న ఆ డబ్బును డ్రా చేసే అవకాశ లేకపోయింది. దీంతో అనుమానం వచ్చిన యువతి వారికి ఫోన్ చేసి నిలదీసింది. ఈ మొత్తాన్ని తిరిగి పొందాలంటే 12 లక్షల 95 వేలు కట్టాలని సైబర్ నేరగాళ్లు తేల్చి చెప్పారు. లేకపోతే కట్టిన డబ్బు కూడా తిరిగి రాదని బెదిరించారు. అప్పటికే 19 లక్షలు చెల్లించి మోసపోవడం.. ఇంకా చెల్లించే స్థోమత లేకపోవడంతో ఆమె నిరాకరించింది. ఆ డబ్బులు వచ్చే అవకాశాలు లేవని, మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించింది. 


గురుగ్రామ్ లో ఇలాంటి ఘటనే - 42 లక్షలు మోసపోయిన టెకీ


పీటీఐ కథనం ప్రకారం... బాధిత వ్యక్తి గురుగ్రాం సెక్టార్ 102లో ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మార్చి 24వ తేదీన అతనికి వాట్సాప్‌లో ఒక పార్ట్ టైం జాబ్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలు లైక్ చేసి అదనపు మొత్తాన్ని సంపాదించుకోవచ్చని అందులో పేర్కొన్నారు. దానికి అంగీకరించిన తర్వాత దివ్య అనే పేరున్న ఒక టెలిగ్రాం గ్రూపులో అతన్ని యాడ్ చేశారు. ఆ గ్రూపులో చేరిన తర్వాత కమల్, అంకిత్, భూమి, హర్ష్ అనే పేర్లున్న గ్రూపు సభ్యులు కచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్పి అతనితో ఇన్వెస్ట్ చేయించారు.


వారి మాటలకు పడిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్... తన బ్యాంకు ఖాతా, తన భార్య బ్యాంకు ఖాతా నుంచి రూ.42,31,600లను వారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ‘నేను వారితో పని చేయడానికి అంగీకరించినప్పుడు దివ్య అనే మహిళ నన్ను ఒక టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేసింది. కచ్చితంగా ఆదాయం వస్తుందని చెప్పి నన్ను నగదు ఇన్వెస్ట్ చేయమన్నారు. నా బ్యాంకు ఖాతా, నా భార్య బ్యాంకు ఖాతాల నుంచి రూ.42,31,600లను వారు తెలిపిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాను.’ అని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనికి రూ.69 లక్షల ఆదాయం వస్తుందని ఆ మోసగాళ్లు నమ్మించారు. అయితే ఆ డబ్బులు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు మరో రూ.11,000 వారు డిమాండ్ చేశారు. అప్పుడు కానీ తాను మోసపోయిన విషయం అతనికి అర్థం కాలేదు. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.