Venkaiah Naidu in Vice President race: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మరోసారి ఉపరాష్ట్రపతి పదవి వరించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వెంకయ్యను నియమించాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఈ మేరకు ఎన్డీఏ పక్షాలతో చర్చించినట్టు సమాచారం అందుకోంది. ఈ విషయంపై వెంకయ్య అభిప్రాయం కూడా తీసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
రాజ్యసభను నిర్వహించడంలో వెంకయ్య సమర్థత
మొన్నటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య కారణాలతో అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఈ రాజీనామాతో ఖాళీ పోస్టులో ఎవర్ని నియమించాలనే చర్చ తీవ్రంగా సాగుతోంది. వచ్చే ఏడాది రెండు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నియామకం జరగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం అనూహ్యంగా వెంకయ్య పేరును తెరపైకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. వెంకయ్యనాయుడుకు రాజ్యాంగంపట్ల, రాజ్యసభ నిర్వహణ పట్ల పట్టు ఉంది. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్న ఐదు సంవత్సరాల కోసం భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సమస్యలు రాలేదు. అదే సమయంలో.. ఆయన పనితీరు అందరి ప్రశంసలు అందుకుంది. బీజేపీ వెంకయ్య పేరును పరిశీలించడానికి ఇది కూడా ఓ కారణం అన్న ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో అంతర్గత పరిణామాలూ కలసి వస్తున్న పరిస్థితి
కుల సమీకరణాలు, ఆర్‌ఎస్‌ఎస్‌తో విభేదాలు, మోదీ రిటైర్మెంట్‌పై విమర్శలు వస్తున్న వేళ అన్నింటికీ చెక్ పెట్టేలా ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలని భావిస్తోంది బీజేపీ. అందులో భాగంగానే వెంకయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోందని అంటున్నారు. మరికొందరు రేసులో ఉన్నప్పటికీ వెంకయ్య అయితే ఏకగ్రీవం అయ్యేందుకు ఛాన్స్ ఉందని అంటున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని నిలబెట్టాలా లేదా అన్నది ఇంకా ఇండీ కూటమి డిసైడ్ చేయలేదు. బీజేపీ వివాదాస్పద అభ్యర్థిని ప్రకటిస్తే.. బరిలో ఉండేందుకు కాంగ్రెస్ కూటమి రెడీ అయ్యే అవకాశం ఉంది. వెంకయ్యనాయుడు పేరు ప్రతిపాదిస్తే.. పోటీ చేయకుండా వెనక్కి తగ్గే అవకాశం ఉంది.
ప్రాంతీయ సమానత్వం కూడా వెంకయ్యకు ప్లస్ పాయింట్
కేంద్రంలో ఇప్పుడు కీలకమైన పదవుల్లో ఉన్న వారంతా వివిధ వర్గాలకు, వివిధ ప్రాంతాలకు రిప్రజెంట్ చేస్తున్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎస్టీ కేటగిరికి చెందిన నేత అయితే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఇలా రాజకీయాలను ప్రభావితం చేసే వర్గాలకు చెందిన వారంతా కీలకమైన పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఓసీ వర్గానికి చెందిన వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా నియమిస్తే ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో దక్షిణాదికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఉన్నత పదవుల్లో ఉత్తరాది వారు మాత్రమే ఉంటే వివక్ష చూపిస్తున్నారన్న విమర్శలు వస్తాయి. అందుకే వెంకయ్య పేరు సీరియస్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు.