Vegetable Prices Hike: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈక్రమంలోనే కడలూరు జిల్లాలోని ఓ విక్రేత తన దుకాణం నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కేవలం 20 రూపాయలకే కిలో టమాటాలను ఇచ్చారు. జిల్లాలోని సెల్లంకుప్పంలో ఉండే కూరగాయలు, ఉల్లిపాయల దుకారణం యజమాని 38 ఏళ్ల రాజేష్ మాట్లాడుతూ... బెంగళూరులో రూ.60 (రవాణా ఖర్చుతో సహా) 550కిలోల టమాటా కొనుగోలు చేసినట్లు తెలిపాడు. వాటిని 40 రూపాయల నష్టంతో కిలోకు 20 రూపాయల చొప్పున పేద ప్రజలకు అందించినట్లు తెలిపారు. అలాగే తన దుకాణం ప్రథమ వార్షికోత్సవం రోజు అంటే 2019లో ఉల్లి ధరలు 100కు పైగా పెరిగినప్పటికీ.. కిలో 10 రూపాయలకే అమ్మినట్లు పేర్కొన్నారు. 


ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ


అలాగే మధ్య ప్రదేశ్ అశోక్ నగర్‌లో ఓ స్మార్ట్‌ ఫోన్ దుకాణం యజమాని ఓ అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు. మొబైల్ కనుగోలు చేసిన వారికి 2 కిలోల కాంప్లిమెంటరీ టొమాటోలను ఫ్రీగా అందజేస్తున్నారు. టమాటాల ధర విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇలా కాంప్లిమెంటరీ కింద టమాటాలను ఇస్తున్నట్లు షాప్ యజమాని అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి తనకు కస్టమర్లు పెరిగారని... ఫోన్ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నట్లు వెల్లడించారు. 


బౌన్సర్లను నియామకం - అంతా తప్పుడు వార్తే


అలాగే ఉత్తర ప్రదేశ్ లో ఓ కూరగాయల విక్రయదారుడు బౌన్సర్‌లను నియమించుకున్నాడంటూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. కానీ ఈ వార్త అవాస్తవమైనదని వివరించింది. ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణలు కూడా తెలిపింది. అలాగే నిజనిర్ధారణ చేయడంతో విఫలం అయ్యామని ప్రకటించింది. ఆ షాపు ఓనర్ ను సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించామని స్పష్టం చేసింది. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ సమాచారాన్ని తమకు అందించినట్లు భావించింది. వార్తల ఉన్నత ప్రమాణాలను చేరడంలో ఈ సారి తప్పు జరిగిందని వివరించింది. ఆ ట్వీట్ ను వెంటనే తొలగించినట్లు పేర్కొంది.






దేశంలో టమాటా ధరలు పెరగడంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలోనే యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటాల దుకాణం ముందు వినియోగదారులను అదుపు చేయడానికి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోయినట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం తప్పు అని చెబుతూ ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. 


ఈరోజు టమాటా ధరలు.. 


వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం టమోటా సగటు ధర రూ.100గా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రూ.127, లక్నోలో రూ.147, చెన్నైలో రూ.105 మరియు దిబ్రూఘర్‌లో రూ.115గా ఉన్నట్లు వివరిస్తున్నారు. 2023 ప్రారంభంలో దాదాపు కిలో టమాటాలు రూ.22 ఉన్నాయని... కానీ భారీ వర్షాల కారణంగా టమాటాల ధర విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. రానున్న 15 రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టి నెల రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఉత్తరాదిలో టమాటా ధర 250రూపాయల పైగానే పలుకుతోంది. దక్షిణాదిలో మాత్రం 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో వందరూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వాటిని ప్రజలకు కిలో 50 రూపాయలకే ఇస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కేవలం 103 రైతుబజార్‌లలో మాత్రమే సబ్సిడీ టమాటా విక్రయిస్తున్నారు. డిమాండ్ భారీగా ఉన్న ఈ పరిస్థితుల్లో దీన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో మనిషికి రెండు కిలోల వరకు ఇస్తున్నారు.