Vantara Jamnagar Elephant Care : మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రజలతో దశాబ్దాల అనుబంధం కలిగిన 36 ఏళ్ల ఏనుగు మాధురి (మహాదేవి) తిరిగి తన సొంత గూటికి చేరుకుంటోంది. జామ్‌నగర్‌లోని తమ సంరక్షణ కేంద్రం నుంచి మాధురి కొల్హాపూర్‌కు బయలుదేరినప్పటికీ, ఆరోగ్యం, సంక్షేమంపై తమ బాధ్యత, పర్యవేక్షణ ముగిసిపోదని ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ సంస్థ వంతారా స్పష్టం చేసింది. మాధురి ఎక్కడ ఉన్నా ప్రాణ రక్షణ, శ్రేయస్సే తమకు ముఖ్యమని పేర్కొన్న సంస్థ.. మాధురి సంరక్షణకు అవసరమైన పూర్తి వైద్య, మౌలిక వసతుల సహకారాన్ని నిరంతరం అందిస్తూనే ఉంటామని అధికారికంగా ప్రకటించింది.
2025 జూలై 30న వంతారాకూ మాధురి
గతంలో మాధురి ఆరోగ్యం క్షీణించడం, జీవన పరిస్థితులపై జంతు సంరక్షణ అధికారులు, పెటా ఇండియా వ్యక్తం చేసిన ఆందోళనలతో న్యాయపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. హై-పవర్డ్ కమిటీ ఆదేశాలతో పాటు బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల అనంతరం 2025 జూలై 30న మాధురిని జామ్‌నగర్‌లోని రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ వంతారా కు తరలించారు. తాము స్వచ్ఛందంగా ఏనుగు కస్టడీని కోరలేదని, అత్యున్నత న్యాయస్థానాలు, సాధికార కమిటీ ఆదేశాల ప్రకారమే ఆమె వైద్య బాధ్యతలను స్వీకరించామని వంతారా వెల్లడించింది. అయితే, కొల్హాపూర్‌లోని నందనీ జైన మఠంతో పాటు అక్కడి ప్రజలకు మాధురితో ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని సంస్థ పేర్కొంది.
ప్రతి షరతును అమలు చేస్తామన్న వంతారా
సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల మేరకు ఇరువర్గాల వాదనలను విన్న హై-పవర్డ్ కమిటీ.. నందనీ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి కొన్ని కఠిన నిబంధనలతో మాధురిని కొల్హాపూర్‌కు తిరిగి పంపేందుకు అనుమతినిచ్చింది. మాధురిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరేగింపుల్లో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ ఉపయోగించరాదని హెచ్‌పీసీ స్పష్టమైన ఆంక్షలు విధించింది. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి నిపుణులైన వైద్యులతో ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. హెచ్‌పీసీ తీసుకున్న ఈ నిర్ణయానికి తాము సంపూర్ణంగా కట్టుబడి ఉంటామని, నిర్దేశించిన ప్రతి షరతును అమలు చేయడంలో సహకరిస్తామని వంతారా ప్రకటించింది.
ఇంకా పూర్తిగా కోలుకోని మాధురి
అయితే, వంతారాలో అందించిన అత్యాధునిక చికిత్సతో మాధురి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు అదుపులోకి వచ్చినప్పటికీ, ఇంకా పూర్తిగా కోలుకోలేదని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికీ ఏనుగు మాధురికి నిరంతర పర్యవేక్షణ, సపోర్టివ్ కేర్ ఎంతో అవసరమని తెలిపాయి. ఇందుకోసం నందనీ ఆవరణలో అవసరమైన వైద్య పరికరాలు, షెల్టర్, అత్యవసర మందులను సమకూర్చడంలో వంతారా పూర్తి సహకారం అందించింది. హెచ్‌పీసీ ఆదేశాలకు అనుగుణంగా తమ వెటర్నరీ వైద్యుల బృందం ప్రతి పక్షం రోజులకు కొల్హాపూర్ వెళ్లి మాధురి ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, అధికారిక నివేదికలను సంబంధిత శాఖలకు సమర్పిస్తుందని స్పష్టం చేసింది.
తామే బాధ్యత తీసుకుంటామని తెలిపిన వంతారా
మాధురి నివసించే ప్రాంతం కంటే ఆమెకు అందే వైద్యం, జంతు సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని వంతారా ప్రకటించింది. వాస్తవాలు, వెటర్నరీ సైన్స్, చట్టబద్ధమైన ప్రక్రియలను గౌరవిస్తూ మూగజీవాల రక్షణకు నిబద్ధతతో పనిచేయడమే తమ విధానమని సంస్థ తెలిపింది. ఈ ప్రక్రియలో మార్గదర్శనం చేసిన సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు, హెచ్‌పీసీలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, జైన మఠం, కొల్హాపూర్ ప్రజలు, పెటా ఇండియాకు వంతారా కృతజ్ఞతలు తెలిపింది. మాధురి సుదీర్ఘకాలం పాటు సంపూర్ణ ఆరోగ్యంతో, గౌరవప్రదమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపాలని సంస్థ ఆకాంక్షించింది.
