Viral News in Telugu: గుజరాత్‌లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర సహా పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. విశ్వమిత్రి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నదిలోని మొసళ్లు వరద నీళ్లతో పాటు ఇళ్లలోకి వస్తున్నాయి. వీటిని చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి వాటిని రక్షిస్తున్నారు. ఇప్పటికే వడోదర ప్రాంతంలో దాదాపు 40 మొసళ్లను రక్షించారు. అటవీశాఖతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలూ ముందుకొచ్చి ఈ రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మొసలిని కాపాడిన సిబ్బంది దాన్ని ఓ స్కూటర్‌పై వేరే చోటకు తరలించారు. ఓ వ్యక్తి స్కూటర్‌ని నడుపుతుండగా వెనకాల కూర్చున్న వ్యక్తి ఆ మొసలిని కదలకుండా పట్టుకున్నాడు. అటవీ శాఖకు అప్పగించేందుకు వెళ్తుండగా ఇలా మార్గ మధ్యలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే ఇది వైరల్ అయిపోయింది.
నదిలో భారీ మొసళ్లు..
విశ్వమిత్రి నదీ తీరంలోనే వడోదర ప్రాంతముంది. ఆ నదిలోని మొసళ్లన్నీ ఇలా బయటకు వస్తున్నాయి. వీటన్నింటినీ రక్షించి మళ్లీ నదుల్లోకి వదులుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఇలా బయటకు వచ్చిన వాటిలో రెండు మొసళ్లు ప్రమాదానికి గురై చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని, వీలైనంత వరకూ అన్నింటినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మొసళ్లకు మత్తు ఇచ్చి పట్టుకోవడం కాస్త కష్టమని, అందుకే వాటిని రెస్క్యూ చేయడంలో కాస్త ఆలస్యం జరుగుతోందని వివరించారు. మొసళ్లతో పాటు పాములు, తాబేళ్లనూ రక్షిస్తున్నారు. ఇటీవలే ఓ 12 అడుగుల మొసలి వడోదరలోని ఓ ఇంట్లోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు రెస్క్యూ టీమ్‌కి కాల్ చేసి సమాచారం అందించారు. కాసేపట్లోనే అక్కడి వచ్చిన సిబ్బంది ఆ మొసలిని పట్టుకుంది.
ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం..
విశ్వమిత్రి నదిలో చాలా ప్రాంతాల్లో నీటి మట్టం 6 నుంచి 8 అడుగులకు పెరిగింది. ఫలితంగా వరద ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉండే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వడోదర ప్రాంతానికి IMD ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సౌరాష్ట్ర, అహ్మదాబాద్‌లోనూ పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయి. సౌత్, సెంట్రల్ గుజరాత్‌లో సెప్టెంబర్ 4వ తేదీ వరకూ ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. సాధారణ వర్షపాతంతో పోల్చి చూస్తే 105% ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలిపింది. 12 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది.