Uttar Pradesh Controversy : హోటల్స్ తో పాటు తినుబండారాలు అమ్మే దుకాణాలపై యజమానుల పేర్లు రాయాలని  ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.  ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేశాయి. ఈ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. 


కన్వర్ యాత్ర  చేసే మార్గాల్లో దుకాణాలపై ఆంక్షలు                        


శ్రావణ మాసంలో లక్షలాది కావడ్ యాత్రికులు హరిద్వార్ వెళ్లి అక్కడ గంగా నది నుంచి నీటిని తీసుకొని తిరిగొస్తారు. ఆ క్రమంలో ముజఫర్‌నగర్ మీదుగా కాలి నడకన వెళ్తారు.దీన్ని కన్వర్ యాత్ర అంటారు. ఈ ఏడాది కన్వర్ యాత్ర జులై 22 నుంచి ప్రారంభం కానుంది. వీరు వెళ్లే దారిలో హోటళ్లలోనే తింటారు. అందుకే.. ఆయా హోటళ్లపై దుకాణ యజమానుల పేర్లు రాయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే ముస్లిం యజమానులు ఉన్న హోటళ్లో హిందూయాత్రికులు తినకూడదని చెప్పేందుకు ఈ ఆదేశాల్చిచనట్లుగా దుమారం ప్రారంభమయింది. 


సుప్రీంకోర్టులో పిటిషన్                       


ఇలా దుకాణాలపై యజమానుల పేర్లు రాయమని ఆదేశించడంపై  ఓ స్వచ్ఛంద సంస్థ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అదేవిధంగా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.  మైనార్టీలను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని  పిటిషన్ దారులు సుప్రీంకోర్టులో ఆరోపించారు.  పలువురు పేదలు, కూరగాయలు, టీ దుకాణాలు నడుపుతున్నారని, ఇటువంటి చర్యల వలన వారి ఆర్థిక పరిస్థితి  క్షీణిస్తోందని వాదించారు 


మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు - స్టే                        


ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు రాష్ట్ర  ప్రభుత్వాలు జారీ చేసినా ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని తెలిపాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికిప్పుడు దుకాణదారులు తమ పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. తమ వద్ద ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాలు శుక్రవారంలోగా తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. నేమ్ ప్లేట్ వివాదంపై తదుపరి విచారణ జూలై 26న జరగనుంది.


ఇప్పటికే అనధికారికంగా అమలు                         


కన్వర్ యాత్ర చేపట్టే మార్గంలో పెద్ద ఎత్తున హోటళ్లు , దాబాలు ఉంటాయి. ఇక్కడ హిందూ దేవుల పేర్లతో హోటళ్లను ముస్లింలు నిర్వహిస్తూ ఉంటారు. వారు అపవిత్రమైన  ఆహారం పెడతారన్న ఆరోపణలతో.. వాటి యజమానుల పేర్లను బోర్డులపై రాయాలని డిమాండ్ చేస్తున్నారు. పలు చోట్ల బలవంతంగా ఆ పేర్లతో  బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం అంతకంతకూ దుమారం రేపుతోంది.