India Canada Tensions:


ముదురుతున్న వివాదం..


భారత్ కెనడా మధ్య రోజురోజుకీ వివాదం ముదురుతోంది. ద్వైపాక్షిక బంధమూ దెబ్బ తినేలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కెనడా చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. ఖలిస్థానీలకు స్వర్గధామంగా మారిపోయిన దేశం...తమపై నిందలు వేయడమేంటని మండి పడుతోంది. ఈ మొత్తం వివాదంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ ఆంటోని బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కెనడా ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టాలని అన్నారు బ్లింకెన్. ఫలితంగా అమెరికా, భారత్ మధ్య కూడా చిచ్చు మొదలైంది. నిజానికి భారత్, అమెరికా మధ్య బంధం చాలా గట్టిగా ఉంది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు జో బైడెన్‌ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు ప్రధాని మోదీ. ఇలాంటి కీలక సమయంలో అనవసరంగా భారత్‌, కెనడా గొడవలో తల దూర్చడం ఎందుకని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొందరు విశ్లేషకులూ చెబుతున్నారు. చైనాని ఎదుర్కునేందుకు భారత్, అమెరికా ఒక్కటయ్యాయి. ఇప్పుడు కెనడా జరుగుతున్న ఘర్షణలో జోక్యం చేసుకుంటే...లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నట్టవుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. 


నిజ్జర్ హత్యతో మొదలు..


ఈ ఏడాది జూన్ 18న ఖలిస్థాన్ వేర్పాటు వాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో రెండు దేశాల మధ్య గొడవ మొదలైంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇది మరింత ముదిరింది. "నిజ్జర్ హత్య వెనకాల భారత్‌ ఉందన్న ఆధారాలు మా వద్ద ఉన్నాయి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. తమ దేశంలో అశాంతి సృష్టించాలని చూస్తే వదలం అంటూ ఫైర్ అయ్యారు. దీనిపైనే భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈలోగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్ "విచారణ జరపాలి" అని కామెంట్స్ చేయడమూ పుండు మీద కారం జల్లినట్టైంది. అందుకే భారత్‌తో మైత్రి కొనసాగిస్తున్న దేశాలు ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అనవసరంగా కామెంట్స్ చేసి ఆ తరవాత సెల్ఫ్ డిఫెన్స్‌లోకి వెళ్లడం ఎందుకని మౌనంగా ఉంటున్నాయి. 


"కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేసే ముందు ఓ సారి ఆలోచించాల్సింది. ఓ సారి ఆరోపణలు చేసిన తరవాత అందుకు తగ్గట్టుగా ఆధారాలనూ చూపించాల్సి ఉంటుంది. ఇవి చాలా దారుణమైన ఆరోపణలు. ఏమీ ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే..కచ్చితంగా కెనడాలో ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నట్టే లెక్క. ట్రూడో పరోక్షంగా ఆ విషయాన్ని ఒప్పుకున్నట్టే అవుతుంది. ఇప్పటికే వివాదం ముదురుతోంది. అందుకే అమెరికా అనవసరంగా ఇందులో జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు"


- ఛార్లెస్ మెయిర్స్, అమెరికా 


పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ (Michael Rubin) చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జస్టిన్ ట్రూడో సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేశారని వెల్లడించారు. భారత్‌పై మళ్లీ వెనక్కి తీసుకోలేని ఆరోపణలు చేశారని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే గుడ్డిగా ఆరోపించడం సరికాదని తేల్చి చెప్పారు. 


"కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సరిదిద్దుకోలేని తప్పు చేశారు. బహుశా ఖలిస్థానీలు కావాలనే ఆయనపై ఒత్తిడి చేసి ఉండొచ్చు. అందుకే భారత్‌పై అలాంటి ఆరోపణలు చేశారు. ఆయన వద్ద ఆధారాలు కూడా లేవు. అయినా కెనడా ప్రభుత్వం ఉగ్రవాదులకు ఎందుకు ఆశ్రయం కల్పిస్తోందో వివరించాల్సిన అవసరముంది"


- మైఖేల్ రూబిన్, పెంటగాన్ మాజీ అధికారి


Also Read: చేతనైతే ముందు మీ దేశాన్ని చక్కబెట్టుకోండి, పాక్‌కి వార్నింగ్ ఇచ్చిన భారత్