ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. పాలస్తీనాకు చెందిన హమాస్‌ గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై తీవ్రంగా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్‌ కూడా తగిన విధంగా స్పందిస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తాము హమాస్‌తో యుద్ధంలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. పరస్పర దాడుల నేపథ్యంలో రెండు ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారాయి. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తోంది. తాము అన్ని విధాలుగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో అమెరికన్‌ పౌరులు కూడా మరణించినట్లు ఆదివారం యూఎస్‌ వెల్లడించారు. ఎంతమంది మరణించారనే విషయం మాత్రం తెలియరాలేదు. అనేక మంది అమెరికా పౌరులు మరణించారని యూఎస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. బాధితులకు, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సానుభూతిని తెలియజేశారు. దాడుల్లో మరణించిన, కనిపించకుండా పోయిన అమెరికన్‌ పౌరుల జాబితాను ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నామని యూఎస్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు.


ఇజ్రాయెల్‌కు యుద్ధంలో సాయం అందించేందుకు అమెరికా నుంచి యుద్ధనౌకలను, యుద్ధవిమానాలను పంపించాలని అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం అధికారులను ఆదేశించారు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు వాషింగ్టన్‌ నుంచి అచంచలమైన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. విమాన వాహక నౌక USS Gerald R Ford తో పాటు పలు యుద్ధనౌకలను తూర్పు మధ్యధరా తీరానికి పంపుతున్నట్లు పెంటగాన్‌ వెల్లడించింది. అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్‌ రక్షణ దళాలకు అదనపు సహాయాన్ని అందిస్తానని, తమ యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు త్వరలోనే ఇజ్రాయెల్‌కు చేరుకుంటాయని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఎదుర్కొంటున్న పరిస్థితులను అదనుగా చూసి ఇతర సంస్థలు ప్రయోజనం పొందాలని చూడొద్దని, అది విపరీత పరిణామాలకు దారితీస్తుందని బైడెన్‌ హెచ్చరించారు.


అయితే ఇజ్రాయెల్‌కు సాయంగా అమెరికా యుద్దనౌకను పంపించడం ద్వారా మన ప్రజలపై దురాక్రమణకు సహకరిస్తోందని హమాస్‌ సంస్థ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్‌- పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల కారణంగా ఇప్పటికే 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇజ్రాయెల్‌లో 700 మంది మరణించగా, గాజాలో కనీసం 400 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కారణంగా సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. హమాస్‌ మిలిటెంట్లు రోడ్లపై కనిపించిన వారితో పాటు ఇళ్లలో లోకి చొరబడి పౌరులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెప్తోంది. 


ఇజ్రాయెల్‌ దళాలకు, హమాస్‌ ఉగ్రవాదులకు మధ్య కిఫర్‌ అజాలో భీకరపోరు కొనసాగుతోంది. ఈ ప్రాంతం గాజా సరిహద్దులో ఉంటుంది. దాంతో కనిపించిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టేందుకు ఐడీఎఫ్‌ ప్రయత్నిస్తోంది. అలాగే ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్‌ దాడులను ఆపడం లేదు. ఆదివారం వేలాది రాకెట్లను ప్రయోగించారు. 100 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా తీకెళ్లిన వీడియాలోను విడుదల చేసింది. గాజాలో తలదాచుకుంటున్న సుమారు 413 మంది హమాస్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టామని  ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్‌) వెల్లడించింది. పదుల సంఖ్యలో వారిని బందీలుగా పట్టుకున్నామని ప్రకటించింది.  ఇజ్రాయెల్‌లోని ఓ సంగీత ఉత్సవంపైనా  హమాస్ దాడి చేసింది. అక్కడ దాదాపు 260 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెలీ రెస్క్యూ సర్వీస్ జకా నివేదించింది. దాడులు జరిగినప్పుడు ఉత్సవంలో ఉన్న ప్రజలు పరిగెత్తడం, వాహనాల్లో దాక్కోవడం వంటి వీడియోలు ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి.