Joe Biden Tests Covid Positive: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి కరోనా సోకింది. ఈ మేరకు వైట్‌హౌజ్ అధికారికంగా ప్రకటించింది. 81 ఏళ్ల బైడెన్‌ ప్రస్తుతం ప్రెసిడెంట్‌ రేసులో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై చాలా రోజులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అధ్యక్ష పదవికి పనికి రారంటూ ట్రంప్ చాలా గట్టిగా వాదిస్తున్నారు. రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్ కూడా చేశారు. బైడెన్ మాత్రం తాను చాలా ఫిట్‌గా ఉన్నానని తేల్చి చెప్పారు. ఆ దేవుడు దిగి వచ్చి చెప్తే తప్ప ఎన్నికల నుంచి తప్పుకోనని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆయనకు కొవిడ్ రావడం ఆందోళన పెంచుతోంది. ఆయన మెడికల్ కండీషన్ మరీ సీరియస్‌గా మారితే రేసు నుంచి తప్పుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. లాస్‌వెగాస్‌లో ఉండగా అస్వస్థతకు గురైన ఆయనకు టెస్ట్ చేయగా కొవిడ్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆయన జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే..బైడెన్‌ మాత్రం తాను బాగున్నానని మీడియాకి స్పష్టం చేశారు. ఇది చాలా సాధారణమని, మెడికేషన్ తీసుకుంటున్నారని వైట్‌హౌజ్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. 


అయితే..ఇటీవలే బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నా అనారోగ్యం మరీ సహకరించని స్థాయిలో ఉంటే అప్పుడు అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటాను" అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ఇలా అస్వస్థతకు గురయ్యారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పటి నుంచే బైడెన్‌పై పొలిటికల్‌గా ఒత్తిడి పెరిగింది. అంతకు ముందు ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లోనూ బైడెన్ పెద్దగా మాట్లాడలేకపోయారు. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు కొవిడ్ రావడం వల్ల ప్రచారానికి దూరమయ్యారు. వ్యాక్సినేషన్ చేశామని,ఐసోలేషన్‌లో ఉంటూనే తన పని తాను చేసుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యలేమీ లేవని తెలిపారు.