Air India Flight Smoking Incident:
పోలీసుల అదుపులో..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఈ మధ్య యూరినేషన్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరవాత కంపెనీ అలెర్ట్ అయింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. దీనిపై ఇంకా చర్చ జరుగుతుండగానే మళ్లీ వార్తల్లో నిలిచింది Air India.
లండన్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్‌లో ఓ 37 ఏళ్ల వ్యక్తి బాత్‌రూమ్‌లో సిగరెట్ తాగడం కలకలం రేపింది. రమాకాంత్ అనే వ్యక్తి సిగరెట్ తాగడమే కాకుండా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కంపెనీ ఫిర్యాదుతో ముంబయి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఫ్లైట్‌లో సిగరెట్ తాగేందుకు అనుమతి లేదని, చెప్పినా వినకుండా ఆ వ్యక్తి అందరినీ ఇబ్బందికి గురి చేశాడని ఎయిర్ ఇండియా సిబ్బంది వెల్లడించింది.
"ఫ్లైట్‌లో స్మోకింగ్‌కు అనుమతి లేదు. కానీ ఆయన బాత్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించారు. వెంటనే అలారం మోగింది. మేమంతా అలెర్ట్ అయ్యి బాత్‌రూమ్ వైపు వెళ్లాం. ఆయన చేతిలో సిగరెట్ ఉంది. మేం ఆ సిగరెట్‌ను లాగేసుకుని పారేశాం. ఇలా చేసినందుకు ఆయన మాపై అరవడం మొదలు పెట్టాడు. ఏదో విధంగా నచ్చజెప్పి ఆయన సీట్‌లో కూర్చోబెట్టాం. కాసేపటి తరవాత ఉన్నట్టుండి లేచి ఫ్లైట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అది చూసి తోటి ప్రయాణికులంతా భయపడిపోయారు. మేం ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. గట్టిగా అరుస్తున్నాడు. చేసేదేమీ లేక మేము ఆయనను గట్టిగా పట్టుకుని చేతులు కాళ్లు కట్టేశాం. మళ్లీ కుర్చీలో బలవంతంగా కూర్చోబెట్టాం"
-ఎయిర్ ఇండియా సిబ్బంది
అలా కాళ్లు చేతులు కట్టేసి కూర్చోబెట్టినా ఆ వ్యక్తి ఊరుకోలేదని సీట్‌కు తన తలను కొట్టుకోవడం మొదలు పెట్టాడని చెప్పింది ఫ్లైట్ సిబ్బంది.
"ప్యాసింజర్స్‌లో ఓ డాక్టర్ ఉన్నాడు. ఆయన ఆ వ్యక్తి దగ్గరికెళ్లి ఏం కావాలో అడిగాడు. తన బ్యాగ్‌లో మెడిసిన్ ఉందని, వెంటనే అది ఇవ్వాలని చెప్పాడు. ఆ బ్యాగ్ అంతా వెతికాం. ఈ సిగరెట్ తప్ప మరేమీ కనిపించలేదు"
-ఎయిర్ ఇండియా సిబ్బంది
ప్రస్తుతానికి ఆ వ్యక్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. రమాకాంత్ భారత్‌కు చెందిన వ్యక్తేనని, అయితే అమెరికా పౌరసత్వం ఉందని చెప్పారు పోలీసులు. మెడికల్ టెస్ట్‌ల కోసం ఆ వ్యక్తి శాంపిల్స్‌ను పంపినట్టు వివరించారు. ఏదైనా మానసిక సమస్యతో బాధ పడుతున్నాడా అని ఆరా తీస్తున్నారు.