US Jets Shot Down: 


అలాస్కాలో చక్కర్లు..


చైనా స్పై బెలూన్ వివాదం ఇంకా ముగిసిపోలేదు. ఇటీవలే ఓ బెలూన్‌ను పేల్చేసిన అమెరికా...ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. ఓ అనుమానాస్పద వస్తువుని గుర్తించిన అమెరికా సైనికులు ఫైటర్ జెట్‌తో దాన్ని కాల్చి పారేశారు. అలాస్కాలో 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఆ వస్తువుని పేల్చేసినట్టు చెప్పారు. "ఎగురుతున్న వస్తువు ఏంటన్నది క్లారిటీ లేదు. కానీ అది ప్రజలకు హాని కలిగిస్తుందేమోనన్న అనుమానంతో ముందుగానే పేల్చేశాం" అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతకు ముందు పేల్చేసిన స్పై బెలూన్ కన్నా తక్కువ సైజ్‌లో ఉన్నట్టు వివరించారు. ఓ చిన్న కారు సైజ్‌లో ఉన్నట్టు తెలిపారు. అది ఎక్కడి నుంచి వచ్చింది..? ఏ దేశానికి చెందింది..? అన్నది తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ వస్తువు గగనతలంలో ఎందుకు చక్కర్లు కొట్టిందన్నదీ ప్రస్తుతానికి తేలలేదని చెప్పారు.