Donald Trump Arrest: 


హీట్ ఎక్కిన రాజకీయాలు..


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ (Donald Trump Arrest) చేస్తారా..? అమెరికాలో భారీ అల్లర్లు జరగనున్నాయా..? కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా ఇదే చర్చ. అగ్రరాజ్యానికి సంబంధించిన విషయం కదా మరి. ఆ మాత్రం ఆసక్తి, ఉత్కంఠ ఉంటాయిగా. పైగా ఒకప్పుడు అమెరికాకు అధ్యక్షుడి కుర్చీలో కూర్చున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారంటే కచ్చితంగా అన్ని దేశాలూ చాలా జాగ్రత్తగా ఇక్కడి పరిస్థితులను పరిశీలిస్తాయి. వచ్చే ఏడాది అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ రేసులో తానూ ఉన్నానని ఇప్పటికే ప్రకటించారు ట్రంప్. ఇలాంటి సమయంలో ఆయనను జైలుకు పంపితే రాజకీయాలు ఏ రేంజ్‌లో హీట్‌ ఎక్కుతాయో ఊహించుకోవచ్చు. బైడెన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూ వస్తున్నారు ట్రంప్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన చేతులకు సంకెళ్లు పడితాయా అన్న ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. 


ట్రంప్ చేసిన నేరమేంటి..? 


ఇంతకీ ట్రంప్ ఏం నేరం చేశారని అరెస్ట్ చేస్తారు..? ఇది తెలియాలంటే 2016 కి రివైండ్ చేయాలి. 2016లో ప్రెసిడెంట్‌ రేస్‌లో నిలబడ్డారు ట్రంప్. అప్పటికే అడల్ట్ యాక్ట్రస్ స్టార్మీ డానియల్స్‌తో (Stormy Daniels) ఆయనకు అక్రమ సంబంధం ఉన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆ నటికి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చారన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దాదాపు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చారని కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడు, న్యాయవాది మైఖేల్ కోహెన్‌ ఇందుకు ప్రత్యక్ష సాక్షి అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆయనే స్వయంగా స్టార్మీ డానియల్స్‌కు ఆ డబ్బుని ఇచ్చినట్టు సమాచారం. దీనిపై మొదటి నుంచీ ట్రంప్‌ తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు. ఇవన్నీ అసత్య ఆరోపణలని...తనను వేధిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. అందుకే...ఆయన అలెర్ట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తనను అరెస్ట్ చేసే అవకాశముందని చెప్పారు. 


నెక్స్ట్ ఏంటి..? 


తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిజమే అని తేలితే ట్రంప్‌ జైలుకెళ్లక తప్పదు. ఆ నటికి డబ్బులిచ్చిన విషయాన్ని అంగీకరించకుండా మభ్య పెడుతున్నారని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించారు. డానియెల్స్ నోరు మూయించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్టు రుజువులు చూపించారు. దీనిపై విచారణ పూర్తయ్యాక కోర్టు ట్రంప్‌పై క్రిమినల్ ఛార్జ్‌ దాఖలవుతుంది. ఇదే జరిగితే...అభియోగాలు ఎదుర్కొన్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ రికార్డుకెక్కుతారు. అయితే...కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. ట్రంప్‌ ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు చూస్తున్నారన్నది మరో ఆరోపణ. డానియల్స్‌కు చెల్లించిన డబ్బుని లీగల్‌ ఫీజులుగా చూపిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనా ఉంది. అంతే కాదు. ఇందుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్‌లు కూడా సృష్టించారని ఆరోపణలొస్తున్నాయి. న్యూయార్క్ చట్టాల ప్రకారమే కాకుండా...ఎన్నికల చట్టం ప్రకారమూ ఇది చాలా పెద్ద నేరం. ఇది కోర్టులో రుజువుతై శిక్ష తప్పదు. ఇక్కడ మరో విషయమూ ఉంది. ఈ నేరం చిన్నదే అయితే కేవలం జరిమానా విధించి వదిలి పెడతారు. లేదంటే మాత్రం జైలు శిక్ష తప్పదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే...కనీసం నాలుగేళ్లు జైలు శిక్ష పడుతుందని తెలుస్తోంది. ఇక ట్రంప్‌పై ఆరోపణలు చేస్తున్న స్టార్మీ డానియెల్స్‌ వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. "ఇవాళ ఏదైనా ఎగ్జైటింగ్ వార్త వినబోతున్నానా" అంటూ ట్రంప్ అరెస్ట్‌పై పరోక్షంగా ట్వీట్ చేశారు. మొత్తంగా... "ట్రంప్ అరెస్ట్" అంశం అంతర్జాతీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది. 


Also Read: దయచేసి రిజైన్ చేయండి, లేదంటే మేమే బయటకు పంపాల్సి ఉంటుంది - జుకర్ బర్గ్ మెయిల్ వైరల్