తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది. అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలారకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. అనేక మంది వీటి బారిన పడి మరణిస్తుంటారు. ఈ సమయాన్నే మన ఋషులు "యమదంష్ట్రలు" అన్నారు. యమద్రంష్ట్రలంటే యముడు తన కోరలు బయటకు పెట్టి అనేక మంది జీవులను నాశనం చేస్తాడని అర్దం. కాబట్టి ప్రజలు ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉగాది పండుగ వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా అదే. మన పూర్వీకులు అందుకే పండుగలు, ఆచారాలు పేరుతో ప్రతి ఒక్కరూ సులభంగా పాటించేలా ఎన్నో నియమాలు రూపొందించారు.


ఉగాది పచ్చడి ఒక మహా ఔషధం. ఈ పచ్చడిని ఒక్క ఉగాది రోజూ మాత్రమే కాదు ఉగాది మొదలుకొని శ్రీ రామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణిమ వరకు ప్రతిరోజు స్వీకరించాలి. ఈ విధంగా 9 లేదా 15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు. ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ-వైరల్ లక్షణలు కలిగింది. కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది. మనకొచ్చే రోగాలలో చాలాశాతం వీటివల్లే వస్తాయి.


ఉగాది రోజు చేసే తైలాభ్యంగన స్నానం (శరీరానికి నువ్వులు నూనె పట్టించి నలుగుపిండితో చేసే స్నానం) శరీరంలో ఉన్న టాక్సిన్స్ (విష పదార్ధాలు)ను తొలగిస్తుంది. ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం. పాత చెత్త, పనికిరాని వస్తువులు తీసేస్తాం. ఇళ్లు చక్కగా కడిగి, గడపకు మామిడి తోరణాలు, బంతిపూలు కడతాం. ఇలా శుభ్రం చేయడం వలన మన చుట్టు వాతావరణం నుంచి మన రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది. బంతి పూలు యాంటీ-సెప్టిక్, యాంటీ-బయోటిక్ లక్షణలు కలిగినవి. మామిడి ఆకులు ఇంట్లోకీ రోగకారక క్రిములు రాకుండా అడ్డుకుంటాయి.


ఉగాది నుంచి శ్రీ రామనవమి వరకు 9 రోజుల పాటూ వసంత నవరాత్రులు పేరుతో అమ్మవారిని, శ్రీ రామచంద్ర మూర్తిని విశేషంగా పూజిస్తాం. చైత్ర పౌర్ణమి వరకు దమన పూజ పేరుతో రోజుకోక దేవుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైజ్ఞానికంగా చూస్తే, ఒక్క రోజు కాదు, దాదాపు 15 రోజుల పాటు ఎంతో శుచి, శుభ్రత పాటిస్తూ, రోజూ దేవుడికి నివేదన చేయడం కోసం పవిత్రంగా తయారుచేసిన ఆహారం తింటూ గడిపేస్తాం.


మొత్తంగా చూస్తే ఉగాదిపచ్చడి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కాబట్టి శరీరంలో ఉన్న క్రిములు నశిస్తాయి. ఉగాదిస్నానం శరీరంలో మలినాలను, విషాలను తీసేస్తుంది. ఇంటి శుభ్రత, మంగళ తోరణాలు బయట నుంచి వ్యాధులు సంక్రమించకుండా రక్షిస్తాయి. 15 రోజుల పాటు నియమబద్ధ జీవితం, పవిత్రమైన, పుష్టకరమైన ఆహారం ఆరోగ్యానికి హేతువులు. ఇవి ఉగాదిలో ఉన్న కొన్ని వైజ్ఞానిక అంశాలను మాత్రమే. మన ఋషులు ఒక పండుగ చేసుకోమని చెప్తే అందులో ఎన్ని అంశాలుంటాయో.