US on CAA Implementation: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని అమలు చేస్తున్నట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అప్పటి నుంచి దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మోదీ సర్కార్ మాత్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో ఈ చట్టం అమలుని పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. మార్చి 11వ తేదీన భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన CAAపై ఆందోళన చెందుతున్నట్టు చెప్పింది.
"మార్చి 11వ తేదీన భారత ప్రభుత్వం CAAని అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ ఇవ్వడంపై కాస్త ఆందోళనగానే ఉంది. ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తారన్నదే ముఖ్యం. అందుకే చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం దేశంలో ప్రతి ఒక్క మతానికీ స్వేచ్ఛ ఉండాలి. అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి"
- మాథ్యూ మిల్లర్, స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి
అటు అమెరికాలోని హిందువులంతా CAA అమలుని స్వాగతించిన నేపథ్యంలోనే అమెరికా ఇలాంటి ప్రకటన చేయడం కీలకంగా మారింది. నిజానికి దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో పౌరసత్వ సవరణ చట్టం గురించి చర్చ జరుగుతోంది. ఐదేళ్ల క్రితమే కేంద్రం ఈ బిల్‌ని తీసుకొచ్చినప్పటికీ అప్పటి నుంచి అమలుకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అమలు చేస్తామని ఐదేళ్ల క్రితమే ప్రకటించింది కేంద్రం. ఆ సమయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ నిరసనలు జరిగాయి. ఆ తరవాత కొవిడ్ సంక్షోభం రెండేళ్ల పాటు వెంటాడింది. ఫలితంగా అమలులో ఆలస్యం జరిగింది. ఇప్పుడు సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్టు మార్చి 11న ప్రకటించింది.