US Air Strikes on Iran Forces: ఎర్ర సముద్రంలో పదేపదే సమస్యలు సృష్టిస్తున్న హౌతీలకు అండగా నిలబడుతోంది ఇరాన్. ఈ విషయంలో అగ్రరాజ్యం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. అందుకే..ఇరాన్‌పై దాడులు మొదలు పెట్టింది. ఇరాక్‌, సిరియాలోని ఇరాన్‌ భద్రతా బలగాలపై గగనతలం నుంచి దాడులు చేసింది. ఈ దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అంతకు ముందు జోర్డాన్‌లోని అమెరికా బేస్‌పై ఇరాన్‌ దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం ఈ అటాక్ చేసింది. ఇకపైనా తాము ఇదే విధంగా దాడులు కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రకటన చేశారు. 


"మధ్యప్రాచ్యంలో అలజడికి తావు ఉండకూడదు. అమెరికా దాన్ని ఏ మాత్రం సహించదు. అక్కడే కాదు. ప్రపంచంలో ఎక్కడ అశాంతి కలిగించాలని చూసినా ఇలాగే స్పందిస్తాం. మా దేశాన్ని ధ్వంసం చేయాలనుకునే వాళ్లకు మేం చెప్పేది ఒక్కటే. ఒక్క అమెరికా పౌరుడికి నష్టం జరిగినా మేం తీవ్రంగా ప్రతిఘటిస్తాం"


- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు 




85 స్థావరాలపై దాడులు 


Islamic Revolutionary Guard Corps Quds Force నే లక్ష్యంగా చేసుకుంది అగ్రరాజ్యం. దాదాపు 85 స్థావరాలపై దాడులు చేసినట్టు వెల్లడించింది. రాకెట్స్‌తో పాటు మిజైల్స్‌నీ ప్రయోగించింది. దాదాపు అరగంట పాటు దాడులు కొనసాగినట్టు స్థానిక మీడియా స్పష్టం చేసింది. ఏ స్థాయిలో నష్టం జరిగిందో ఇంకా తెలియలేదని, త్వరలోనే ఆ లెక్కల్ని వెల్లడిస్తామని తెలిపింది. సిరియా కూడా ఈ దాడులపై స్పందించింది. దాదాపు 26 కీలక ప్రాంతాలు ధ్వంసం అయ్యాయని వెల్లడించింది. ఆయుధాల వేర్‌హౌజ్‌తో పాటు ఓ కమాండ్‌ సెంటర్‌పైనా దాడులు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఇవి మరింత ఆందోళనలు పెంచే అవకాశాలున్నాయి.