Cabinet meeting to be chaired by Modi on Saturday:  శనివారం ఉదయం 11:30 గంటలకు కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుండటం దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది.  దేశ రాజధానిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం శనివారం ఉదయం 11:30 గంటలకు అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించింది. సాధారణంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరిగే సమావేశాలకు భిన్నంగా, ఇలా అకస్మాత్తుగా  అన్-షెడ్యూల్డ్  భేటీని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి సంబంధించి ఎజెండాను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

 కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం 

సాధారణంగా ఇలాంటి హఠాత్తు సమావేశాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే లేదా సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంటుందని భావిస్తారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పాలసీ మార్పులు లేదా అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశాలపై చర్చించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ భేటీని పిలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది.

 ప్రజా ప్రాధాన్యత గల అంశాలపై చర్చ? 

పార్లమెంటులో  చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయిన తరుణంలో   ఈ భేటీ జరుగుతోంది.  ప్రభుత్వం ఏదైనా కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చే ఆలోచనలో ఉందా? లేక అత్యవసర నిర్ణయాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో  రాజకీయ పార్టీలు  నిశితంగా పరిశీలిస్తోంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ భేటీ ఖరారు కావడంతో, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తీసుకోబోయే ఆ  ముఖ్యమైన నిర్ణయం  ఏమిటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కేంద్రం నుంచి వచ్చే అధికారిక సమాచారం దీనిపై స్పష్టత ఇవ్వనుంది.