Iran Says Hormuz Strait Now Completely Open:    ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి  ఇప్పుడు వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా ఓపెన్ చేశామని ఇరాన్ ప్రకటించింది. గత కొద్దికాలంగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లకు భారీ ఊరటనిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు రవాణాకు ఈ మార్గం అత్యంత కీలకం కావడంతో, ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన ధరలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

Continues below advertisement

అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఇరాన్ ఈ ప్రకటన చేసింది. అలాగే లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం కూడా దీనికి కారణం.  గతంలో అమెరికా నౌకలపై ఆంక్షలు విధించిన ఇరాన్, ఇప్పుడు అంతర్జాతీయ చట్టాలకు లోబడి నౌకల రాకపోకలను అనుమతిస్తామని స్పష్టం చేసింది. అయితే, అమెరికా విధించిన కొన్ని ఆంక్షలను సవాలు చేస్తూనే, శాంతియుత వాణిజ్యానికి తాము కట్టుబడి ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ పేర్కొన్నారు.   

Continues below advertisement

మరోవైపు, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం అమెరికా , మిత్రదేశాలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలు ,  ఇతర భద్రతా అంశాలపై రాజీ పడితేనే ఈ మార్గం సురక్షితంగా ఉంటుందని అమెరికా వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ  , ఈ జలసంధి పునఃప్రారంభానికి ఒక ఆశాకిరణంగా మారింది.  

 ప్రస్తుతానికి వాణిజ్య నౌకల కోసం మార్గం తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, భద్రతాపరమైన ఆందోళనలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు ఈ మార్గంలో ప్రయాణించే ముందు రిస్క్ అసెస్‌మెంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలు ఈ జలసంధి   శాశ్వత భద్రతను , అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థిరత్వాన్ని నిర్ణయించనున్నాయి.