UP Mathura:


డిమాండ్ చేసి మరీ తిరిగి విధుల్లోకి..


యూపీలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను చెత్తబండిలో వేయంటపై అధికారులు సీరియస్ అయి ఉద్యోగం నుంచి తొలగించారు. రెండ్రోజుల తరవాత అతడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్మికుడిని పనిలో నుంచి తీసేయటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ కారణంగా...అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కార్మికుడితో పాటు, అతని కుటుంబం డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుని విధుల్లోకి తిరిగి తీసుకున్నామని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. 


ఏం జరిగిందంటే..? 
 
ఓ పారిశుద్ధ్య కార్మికుడు తన డ్యూటీ తాను కరెక్ట్‌గా చేసినందుకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. యూపీలో జరిగిందీ ఘటన. మధురలోని గెనెరల్‌గంజ్‌లో చెత్తను సేకరించే కార్మికుడికి, చెత్త కుండీలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కనిపించాయి. తన డ్యూటీ ప్రకారం ఆ రెండు ఫోటోలను కూడా బండిలో వేసుకుని వెళ్లిపోయాడు. ఇది చూసిన స్థానికులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే, వివాదమైంది. అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తావంటూ అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారు అధికారులు. "ఇలా ఎందుకు చేశావ్" అని ఆ కార్మికుడిని అధికారులు ప్రశ్నించారు. "అవి రోడ్డుపైన పారేసి ఉన్నాయి. నా డ్యూటీ నేను చేశానంతే" అని సమాధానమిచ్చాడు. గార్బేజ్ కార్ట్‌లోని రెండు ఫోటోలను చూసిన వెంటనే స్థానికులు వాటిని బయటకు తీశారు. మరో ఫోటో కూడా అడుగున ఉండిపోయిందని చెప్పారు. ఓ వ్యక్తి కార్‌లో నుంచి దిగి ఈ ఫోటోలను తీసుకుని శుభ్రం చేసి తీసుకెళ్లిపోయినట్టు కొన్ని వీడియోలూ సోషల్ మీడియాలో కనిపించాయి. "బాబీ అనే ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా, వెంటనే అతడిని విధుల్లో నుంచి తొలగిస్తున్నాం" అని అడిషనల్ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. "ఆ ఫోటోలు రోడ్డుపైన పడి ఉంటే అది నా తప్పు కాదు కదా" అని వాదిస్తున్నాడు ఆ కార్మికుడు. "నన్ను ఉద్యోగంలో నుంచి తీసే ముందు అసలేం జరిగింది అని విచారించాలి. అది నిజంగా నా తప్పేనా అని ఆలోచించాలి. అప్పుడు నిర్ణయం తీసుకోవాలి" అని అని అసహనం వ్యక్తం చేశాడు.