ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల వేడి పెరిగింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా దేవి.. ఈరోజు భాజపాలో చేరారు. ఇది సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద షాక్ అని విశ్లేషకులు అంటున్నారు. పైగా ములాయం సింగ్ ఆశిర్వాదంతోనే తాను భాజపాలో చేరినట్లు అపర్ణా దేవి.. ఏబీపీ న్యూస్‌కు ఇచ్చి ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ప్ర. భాజపాలో చేరే ముందు ములాయం సింగ్‌కు సమాచారమిచ్చారా?


అపర్ణ: ములాయం సింగ్ యాదవ్ గారి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.


ప్ర. ములాయం సింగ్ మీ తరఫున ప్రచారం చేస్తారా?


అపర్ణ: ఆయన ఆశీర్వాదాలు నాకు అందాయి.. ప్రచారం చేస్తారా లేదా? అనే విషయాలు ఇప్పటికి అప్రస్తుతం.


ప్ర. సమాజ్‌వాదీ పార్టీలోనే మీరు ఎందుకు కొనసాగలేకపోయారు?


అపర్ణ: ఇరు పార్టీల మధ్య భావజాలంలో తేడా ఉంది. ఏ పార్టీలో కావాలంటే అందులో చేరే స్వేచ్ఛ మాకు ఉంది. భాజపాకు చాలా కృతజ్ఞతలు. దేశానికి సేవ చేసేందుకు నేను భాజపాలో చేరాను. నాకు అన్నింటికంటే దేశమే ముఖ్యం. ప్రధాని మోదీ చేస్తోన్న అభివృద్ధిని చూసి గర్విస్తున్నాను.


ప్ర. పార్టీ మారిన తర్వాత ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నారా?


అపర్ణ: నేను ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా.. కష్టపడి పని చేశాను. ప్రజాదరణ సంపాదించుకున్నాను. లఖ్‌నవూ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసినప్పుడు గత 27 ఏళ్లలో అక్కడ ఏ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థికి రానన్ని ఓట్లు నాకు వచ్చాయి.


పోటికి దూరం..


ములాయం సింగ్ రెండో భార్యకు పుట్టిన ప్రతీక్ యాదవ్​ను అపర్ణ వివాహం చేసుకున్నారు. 2017 ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. అపర్ణ భాజపాలో చేరుతారని ముందు నుంచీ ఊహాగానాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఇప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.


అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ పోటీ చేయరని సమాచారం. భాజపా మహిళా మోర్చా బాధ్యతలు ఆమెకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: Aparna Yadav Joins BJP: అనుకున్నట్లే అయింది.. భాజపాలోకి ములాయం చిన్నకోడలు.. సమాజ్‌వాదీలో గుబులు!


Also Read: UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి