UP Cold Storage:
సంభల్ జిల్లాలో ప్రమాదం..
యూపీలోని సంభల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కూలి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మొత్తం 21 మందిని బయటకు తీసుకురాగా వారిలో 10 మంది మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 50 వేలు ఇస్తామని వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదం జరగడానికి కారణాలేంటో విచారించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. డీఐజీ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. వీలైనంత త్వరగా ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు యోగి. గాయపడిన వారందరికీ సరైన విధంగా వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొరాదాబాద్ ఆసుపత్రిలో 5గురికి చికిత్స అందిస్తున్నారు. 6గురిని డిశ్చార్జ్ చేశారు. NDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. సెర్చ్‌లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే కోల్డ్ స్టోరేజ్ పైకప్పు ఎందుకు కూలిందో పోలీసులు ప్రాథమికంగా వివరణ ఇచ్చారు. మూడు నెలల క్రితమే దీన్ని నిర్మించారని, అనుమతి లేకుండానే నిర్మాణం పూర్తి చేశారని చెప్పారు. పైకప్పుపై భారీ మొత్తంలో ఆలుగడ్డలు నిల్వ ఉంచారని, ఈ బరువు మోయలేకే పైకప్పు కూలిపోయిందని చెప్పారు. ప్రస్తుతానికి ఆ కోల్డ్ స్టోరేజ్ యజమానులపై కేసు నమోదు చేశారు.