Unnatural With Wife A Punishable Offence:  భార్యతో బలవంతంగా జరిగే అసహజ శృంగారం  భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 377 కింద నేరమని  హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు  తీర్పు చెప్పింది.   వైవాహిక అత్యాచారానికి (marital rape) సంబంధించిన మినహాయింపు సెక్షన్ 377కి వర్తించదని తెలిపింది. భర్త భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అసహజ లైంగిక చర్యలో పాల్గొంటే, అది శిక్షార్హమైన నేరమని తెలిపింది.  2024 జులైలో ఉత్తరాఖండ్ హైకోర్టు  భర్తను సెక్షన్ 377 కింద నేరస్థుడిగా పరిగణించలేమని ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ భార్య హక్కుల రక్షణలో కీలకమైన తీర్పు చెప్పింది. 

నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు తీర్పును సూచిస్తూ, ఒప్పందం లేని అసహజ లైంగిక చర్యలు సెక్షన్ 377 కింద నేరమని  హైకోర్టు స్పష్టం చేసింది. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 377కి సంబంధించినది, ఇది అసహజ లైంగిక చర్యలను నేరంగా పరిగణించింది.  సుప్రీంకోర్టు సెక్షన్ 377ని పాక్షికంగా రద్దు చేస్తూ, సమ్మతితో కూడిన స్వలింగ సంబంధాలను నేరం నుండి మినహాయించింది. ఇది రాజ్యాంగ హక్కులైన సమానత్వం, గోప్యత,   వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని పేర్కొంది. అయితే, అంగీకారం లేని అసహజ లైంగిక చర్యలు, జంతువులతో లైంగిక చర్యలు,   మైనర్లతో లైంగిక చర్యలు సెక్షన్ 377 కింద నేరంగా కొనసాగుతాయి.