Unluckiest Lottery Buyer Kerala: అదృష్టం ఎప్పుడో ఒకప్పుడు తన తలుపు తడుతుందని, లక్ష్మీదేవి తనను కరుణించకపోదనే నమ్మకంతో ఒక వ్యక్తి ఏకంగా 60 ఏళ్ల పాటు ఎదురుచూశాడు. రెండు కోట్లు ఖర్చు పెట్టి లాటరీలు కొంటూనే ఉన్నాడు.కానీ ఎప్పుడూ లక్కే తగల్లేదు.
కేరళలోని కరివెల్లూర్, పాలక్కున్ను ప్రాంతానికి చెందిన పి.పి. రాఘవన్ అనే రైతు కథ ఇది. సాధారణంగా లాటరీ తగిలినా, తగలకపోయినా చాలా మంది ఆ టికెట్లను పారేస్తుంటారు. కానీ రాఘవన్ మాత్రం తను కొన్న ప్రతి ఒక్క టికెట్‌ను జాగ్రత్తగా దాచిపెట్టాడు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఐదు పెద్ద సంచుల నిండా లాటరీ టికెట్లు ఉన్నాయి. ఇవి గెలుచుకున్న బహుమతుల టికెట్లు కావు.. ఆరు దశాబ్దాల పాటు ఆయన గుండెల్లో మోసిన ఆశలు, నిరాశల తాలూకు సజీవ సాక్ష్యాలు.
రాఘవన్ లాటరీల ప్రయాణం 1967లో భూటాన్ లాటరీ టికెట్ కొనడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత సరిగ్గా అదే ఏడాది నవంబర్ 1, 1967న కేరళ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా సొంతంగా లాటరీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. నిరుద్యోగాన్ని నిర్మూలించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం లక్ష్యంగా రూ. 50 వేల బంపర్ ప్రైజ్‌తో వచ్చిన ఆ మొదటి కేరళ లాటరీ టికెట్‌ను రాఘవన్ కేవలం ఒక్క రూపాయి పెట్టి కొన్నారు. అలా సరదాగా మొదలైన అలవాటు.. కాలక్రమేణా ఆయనకు ఒక వ్యసనంగా, జీవితకాల అన్వేషణగా మారిపోయింది. ఇటీవల విడుదలైన విషు బంపర్ లాటరీ వరకు ఆయన టికెట్లు కొంటూనే ఉన్నారు.
ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఆ జాక్‌పాట్ అదృష్టం రాఘవన్‌ను ఎప్పుడూ వరించలేదు. మధ్యమధ్యలో భూటాన్ లాటరీలో రూ. 4,000 వంటి చిన్న చిన్న బహుమతులు వచ్చినప్పటికీ, జీవితాన్ని మార్చేసే పెద్ద బంపర్ ప్రైజ్ మాత్రం ఎప్పుడూ దక్కలేదు. ఆయన తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో వరి, కొబ్బరి, అరటి తోటలు సాగు చేస్తూ, పశువుల పెంపకం ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని లాటరీ టికెట్లకే తగలేశారు. కొన్ని రోజుల్లో పయ్యనూర్, కాన్హంగాడ్ వంటి ప్రాంతాలకు ప్రయాణించి మరీ రోజుకు రూ. 1,000 నుండి రూ. 3,000 వరకు టికెట్ల కోసం ఖర్చు చేసేవారు.
అదృష్టం వెనుక పరిగెత్తిన ఈ గుడ్డి నమ్మకం రాఘవన్‌ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది. రోజురోజుకూ అప్పులు పెరిగిపోవడంతో, చివరికి తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, తన భార్య ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు కోట్ల రూపాయల జాక్‌పాట్ కొట్టాలని కలలు గన్న రాఘవన్.. తాను కొన్న టికెట్ల విలువ మొత్తాన్ని లెక్కగడితే అది దాదాపు రూ. 2 కోట్లకు చేరిందని తెలిసి షాకయ్యారు. కేవలం లాటరీ టికెట్ల కోసమే రూ. 2 కోట్లు తగలేసిన రికార్డు బహుశా ఆయన ఒక్కడికే దక్కుతుంది. అందుకే ఆయన్ను అందరూ కోట్లు నష్టపోయిన దురదృష్టవంతుడు అని పిలుస్తుంటారు.
ప్రస్తుతం వృద్ధాప్య సమస్యల వల్ల రాఘవన్ ఇంటికే పరిమితమయ్యారు. ఆయన, భార్య కె. శాంతతో కలిసి కేవలం 25 సెంట్ల స్థలంలో ఉన్న ఒక చిన్న ఇంట్లో శేషజీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు క్రమం తప్పకుండా రోజువారీ టికెట్లు కొనడం మానేసినా, కేవలం బంపర్ లాటరీలు వచ్చినప్పుడు మాత్రం ఇప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. లక్ష్మీదేవి నన్ను ఏదో ఒక రోజు కరుణిస్తుందని బలంగా నమ్మాను, కానీ అది ఎప్పటికీ జరగలేదు. ఈ రోజు నేను కోట్లు నష్టపోయిన ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడిని అంటూ రాఘవన్ బాధపడుతూంటారు.
