ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయాల విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఉంది. అయితే ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తోంది. ఏపీలో కేంద్ర విమానయానశాఖ చేపట్టాలనుకున్న ప్రాజెక్టులు.. వాటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం ఇటీవలే విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాదిత్య సింధియా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. అందులో కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రాష్ట్ర చేయాల్సిన సహకారాన్ని గుర్తు చేశారు. 


తిరుపతి విమానాశ్రయానికి చాలా కాలం క్రితం అంతర్జాతీయ హోదా వచ్చింది. అయితే అక్కడ రన్ వే మాత్రం ఇంకా చిన్నగానే ఉంది. దాన్ని విస్తరిస్తే పెద్ద విమానాలు దిగడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ ప్రతిపాదనలు చాలా కాలం నుంచి ఉన్నాయి. రన్ వే విస్తరణ, ఇతర అవసరాల కోసం 14.31 ఎకరాల భూమి అవసరం ఉంది. దీన్ని సమీకరించి ఇవ్వాలని కేంద్రమంత్రి సీఎంను కోరారు. అలాగే రాజమండ్రి విమానాశ్రయంలో వివిధ రకాల అవసరాలకు  10.25 ఎకరాలు , కడపలో రన్‌వే విస్తరణ, అప్రోచ్‌ లైనింగ్‌ సిస్టం కోసం 50 ఎకరాలు అవసరమని గుర్తు చేశారు. ఈ అవసరాలను చాలా కాలం కిందటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినా స్పందించలేదని సింధియా లేఖలో పేర్కొన్నారు. 


ఇటీవలే విజయవాడ రన్‌వేను విస్తరించి ప్రారభించారు. అయితే ఆ రన్‌వేను  4వేల మీటర్ల వరకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఇలా చేయాలంటే ఏలూరు కాలువను మళ్లించాల్సి ఉంది. ఈ పనులను చేపట్టాలని సింధియా సీఎం జగన్‌ను కోరారు. ఉడాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14.64 కోట్లను చెల్లిచాల్సి ఉందని..  వెంటనే ఈ మొత్తాన్ని  రీజినల్‌ ఎయిర్‌ కనెక్టివిటీ ట్రస్టుకు జమ చేయాలని కోరారు.  వీజీఎఫ్‌ వాటాగా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు.  విశాఖపట్నం - దుబాయి మధ్య అంతర్జాతీయ విమానాలు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దీని కోసం ఏం చేయాలో కూడా లేఖలో సింధియా వివరించారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద వంద శాతం మొత్తాన్ని సమకూరిస్తే ఎయిర్‌లైన్స్‌ కోసం బిడ్డింగ్‌కు పెడతామని చెప్పారు.


వీటన్నింటిపై ఏపీ సర్కార్ స్పందించిన తర్వాత అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తామని సింధియా తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి పలు కంపెనీలు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. దీనికి కారణం ఉడాన్ పథకం కింద వారికి ఇవ్వాల్సిన ప్రోత్సహకాలు ఇవ్వకపోవడమే కారణం అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రమంత్రి కూడా.. రూ.14.64 కోట్లను చెల్లిచాల్సి ఉందని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.