Increases MSP for Kharif Crops: దేశంలోని అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 2026-27 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సాగు వ్యయంపై రైతులకు కనీసం 50 శాతం లాభం ఉండాలన్న లక్ష్యంతోనే ఈ ధరలను సవరించినట్లు ఆయన స్పష్టం చేశారు.

కేబినెట్ నిర్ణయాల ప్రకారం  అత్యధికంగా పండించే సాధారణ రకం వరి మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.72 పెంచి, రూ. 2,441  కు చేర్చారు. అలాగే గ్రేడ్-ఏ రకం వరి ధరను రూ. 2,461  గా నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల సుమారు రూ.2.60 లక్షల కోట్ల రూపాయల మేర రైతులకు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కందుల ధరను క్వింటాల్‌కు రూ.8,450 కు, పెసర ధరను రూ. 8,780 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

ముఖ్యంగా నూనె గింజల సాగు చేసే రైతులకు ఈసారి భారీ ఊరట లభించింది. పొద్దుతిరుగుడు విత్తనాల ధరను అత్యధికంగా క్వింటాల్‌కు రూ.622 పెంచగా, పత్తి  ధరను రూ. 557 మేర పెంచారు. నువ్వుల ధరపై రూ.500 పెంపును ప్రకటించారు. ముతక ధాన్యాల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంలో భాగంగా సజ్జల ధరను రూ.2,900 కు, మొక్కజొన్న ధరను రూ.2,410 కు , రాగుల ధరను రూ.5,205 కు పెంచారు. ఈ పెంపుదల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్నిస్తుందని మంత్రి పేర్కొన్నారు.   

రైతులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా కేబినెట్ శుభవార్త చెప్పింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని  3 శాతం కరువు భత్యం  పెంపునకు ఆమోదం తెలిపింది. జూలై 1, 2025 నుండి ఇది అమలులోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఒకే రోజు అటు అన్నదాతలకు, ఇటు ఉద్యోగులకు అనుకూల నిర్ణయాలు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 ఈ ధరల పెంపు ద్వారా దేశంలో నూనె గింజలు, పప్పుధాన్యాల దిగుమతులను తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి MSP పెరుగుదల శాతం ఆశాజనకంగా ఉందని, ఇది పెట్టుబడి ఖర్చులు పెరిగినందున రైతులకు ఎంతో ఊరటనిస్తుందని భావిస్తున్నారు.