Budget 2024 Highlights: వ్యవసాయ రంగానికి తాము ఎప్పుడూ ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేసిన కేంద్రం అందుకు తగ్గట్టుగానే ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేటాయింపులు చేసినట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకూ భారీగానే కేటాయింపులు చేశారు. కోటి మంది రైతులకు సహజ సాగుపై శిక్షణ అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలోనూ డిజిటల్ ఇన్‌ఫ్రాని అభివృద్ధి చేస్తారమని తెలిపారు. దిగుబడి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 






వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వ్యవసాయంలో కొత్త విధానాలు అవసరమని భావిస్తున్న కేంద్రం ప్రకృతి సాగుపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతోంది. పురుగు మందులపై ఆధారపడడం తగ్గించి సహజ సిద్ధంగా పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించనుంది. పైగా ఈ విధానం ద్వారా ఖర్చు భారీగా తగ్గుతుంది. రైతుపై భారమూ పడదు. అంతే కాదు. మట్టి కూడా సారవంతమవుతుంది. కూరగాయల ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యేకంగా క్లస్టర్‌లు ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ క్లస్టర్ల ఏర్పాటు చేస్తామని తెలిపింది.


2023-24 బడ్జెట్‌లో మోదీ సర్కార్‌ రూ.లక్షా 25 వేల కోట్ల నిధులు కేటాయించింది. ఈ సారి ఈ నిధుల్ని మరింత పెంచింది. ప్రధాని మంత్రి కిసాన్ సమాన్ నిధి ద్వారా పెద్ద ఎత్తున రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన వెంటనే PM Kisan Nidhi scheme నిధులు విడుదల చేశారు. తద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.