Unified Pension Scheme Eligibility: కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీసుకున్న మూడు కీలక నిర్ణయాల్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఒకటి. దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుతుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఉద్యోగులందరికీ ఆర్థిక భద్రత ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. రిటైర్‌మెంట్ తరవాత ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. National Pension System ఇది ప్రత్యామ్నాయం అని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. 2023లోనే ఆర్థిక శాఖ NPSపై రివ్యూ చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. ఆ తరవాతే Unified Pension Scheme (UPS)ని తీసుకొచ్చింది. NPSలో ఉన్న వాళ్లంతా UPSకి షిఫ్ట్ అయ్యే వెసులుబాటు కల్పించింది. పెన్షన్‌పై భరోసా (New Pension Scheme) ఇవ్వడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. మరి ఈ స్కీమ్ వివరాలేంటో తెలుసుకోండి.
ప్రయోజనాలేంటి..?
ఈ స్కీమ్ ద్వారా 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు కచ్చితంగా పెన్షన్ వస్తుంది. రిటైర్ అయ్యే ముందు 12 నెలల పాటు వాళ్లు ఎంత జీతం తీసుకున్నారో పరిశీలిస్తారు. అందులో 50% మేర బేసిక్ పే ని పెన్షన్‌గా ఇస్తారు. పదేళ్ల సర్వీస్ ఉన్న వాళ్లకి మరో ప్లాన్ కూడా ప్రకటించింది కేంద్రం. ఒకవేళ పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే ఆ పింఛన్‌లో 60% మేర కుటుంబానికి అందిస్తారు. పదేళ్ల సర్వీస్ తరవాత కనీస పెన్షన్‌ని రూ.10 వేలుగా నిర్ధరించారు.
ఎవరు అర్హులు...?
2025 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ఈ కొత్త స్కీమ్ అమల్లోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది. అయితే...2025లో మార్చి 31న లేదా ఆ తేదీ లోగా రిటైర్ అయిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ స్కీమ్‌లోని క్రైటేరియా ప్రకారం 25 ఏళ్ల సర్వీస్ ఉండి తీరాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌పై కీలక ట్వీట్ చేశారు. దేశ అభివృద్ధి కోసం పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరి పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేశారు. వాళ్లందరూ మరింత గౌరవంగా బతికేందుకు, ఆర్థిక భద్రత కల్పించేందుకు యునిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ని ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. వాళ్ల భవిష్యత్‌కి ఓ భరోసా ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 23 లక్షల మంది ఉద్యోగులకు ఇది లబ్ధి చేకూరుతుందని కేంద్రం చెబుతున్నా..రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే స్కీమ్‌ని ఎంచుకుంటే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు పెరిగే అవకాశముంది. Old Pension Scheme ప్రకారం రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు చివరగా వాళ్ల జీతం ఎంత ఉందో అందులో సగం నెలవారీ పెన్షన్‌గా ఇస్తున్నారు. DA పెరిగిన ప్రతిసారీ ఈ మొత్తం పెరుగుతోంది.
Also Read: New Pension Scheme: ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్, 3 నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం