Rishi Sunak Resigns: యూకే ఎన్నికల్లో ఓడిపోయిన రిషి సునాక్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బంకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లోని కింగ్ ఛార్లెస్‌ని కలిసి తన రాజీనామాని సమర్పించారు. ఆ తరవాత కీలక ప్రసంగం చేశారు. ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నానని వెల్లడించారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. దేశం కోసం తాను ఏమి చేయగలనో అన్నీ చేశానని, కానీ ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకున్నారని స్పష్టంగా అర్థమైందని వెల్లడించారు. ప్రజాతీర్పుని గౌరవించాల్సిన అవసరముందని అన్నారు. 


"ప్రధాని పదవి అనేది చాలా బాధ్యతాయుతమైనది. అందుకు తగ్గట్టుగానే నేను నా విధులన్నీ కచ్చితంగా నిర్వర్తించాను. కానీ మీరు ప్రభుత్వ మార్పుని కోరుకున్నారు. అది ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా అర్థమైంది. మీ తీర్పుని గౌరవించాల్సిందే. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. చాలా రోజులుగా కన్జర్వేటివ్ పార్టీ కార్యకర్తలు నేతలు విరామం లేకుండా పని చేశారు. కానీ విజయం సాధించలేకపోయాం. మీ శ్రమకి తగ్గ ఫలితం రానందుకు చాలా బాధగా ఉంది. అందుకు నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఓటమికి బాధ్యత నాదే"


- రిషి సునాక్, బ్రిటన్ మాజీ ప్రధాని