సమస్యలు పరిష్కరించుకుంటారు: దీపాలి


మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర అప్‌డేట్ వస్తోంది. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతునిస్తూ ఉద్దవ్ ఠాక్రే  చేసిన ప్రకటన షాక్ ఇచ్చింది. పైగా భాజపాతో మళ్లీ కలిసేందుకు అవకాశాలున్నాయన్న సంకేతాలూ ఇచ్చింది ఆ ప్రకటన. ఇప్పుడు మరో ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. త్వరలోనే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కలవబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అందులో నిజమెంత అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మరాఠీ నటి దీపాలి సాయేద్ చేసి ట్వీట్‌ చేయటంతోనే
ఇది తెరపైకి వచ్చింది. వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలపై చర్చించి, మళ్లీ కలిసిపోయేందుకు త్వరలోనే కలుస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. భాజపా నేతలు కొందరు, వీరిద్దరి భేటీకి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు చెప్పారు దీపాలి. తనను తాను శివసేన లీడర్‌గా చెప్పుకునే దీపాలి ఈ ట్వీట్ చేయటం శివసేనను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పార్టీలో తనకు ఏ క్యాడర్ లేదని స్పష్టం చేసింది శివసేన. 2019లో ముంబ్ర-కల్వా నియోజకవర్గం నుంచి శివసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు దీపాలి. అంతకు ముందు 2014లో ఆప్ తరపున అహ్మదానగర్‌ నుంచి పోటీ చేసి, అప్పుడు కూడా ఓటమి పాలయ్యారు.





 


అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు..


"శివసైనికుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి ఏక్‌నాథ్ శిందే, ఉద్దవ్ ఠాక్రే మరో రెండు రోజుల్లో కలవనున్నారు. శివసైనికుల అభిప్రాయాలేంటో శిందే పూర్తిగా అర్థం చేసుకున్నారు. అటు ఠాక్రే కూడా శిందే అసహనానికి కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు. అందుకే కొందరు భాజపా నేతలు వీళ్లిద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు" అని ట్వీట్ చేశారు దీపాలి సాయేద్. తన ట్విటర్‌ డిస్క్రిప్షన్‌లోనూ "శివసేన నేత" అని రాసుకున్నారు దీపాలి. ఈమె ట్వీట్ చేసిన విషయాన్ని తెలుసుకున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. "నేను సాధారణ కార్యకర్తలాంటి వాడిని. శిందే, ఠాక్రే మధ్య మీటింగ్ జరుగుతుందన్న విషయమైతే నా వరకూ రాలేదు" అని వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండు వారాలు దాటినా, ఇప్పటి వరకూ కేబినెట్ విస్తరణ చేపట్టకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సంజయ్ రౌత్. ఒకవేళ వాళ్లు మంత్రి వర్గ విస్తరణ చేసి, మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించినా..వాళ్లపై అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఉన్నారని అన్నారు. 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఈ అభద్రతా భావంతోనే ఉన్నారని చెప్పారు సంజయ్ రౌత్.  సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ కొనసాగుతున్నందున, కేబినెట్ విస్తరణ చేపట్టేలరని స్పష్టం చేశారు.