Twitter CEO Dog:
శునకమే సీఈవో అట..
ట్విటర్‌కు కొత్త సీఈవోని అపాయింట్ చేశారు ఎలన్ మస్క్. అదేంటి..? మొన్నే కదా ఆయన ట్విటర్‌ను కొన్నది. మళ్లీ కొత్త సీఈవో ఏంటి..అనుకుంటున్నారా. ఇది మేం చెప్పింది కాదు. స్వయంగా ఎలన్ మస్క్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే...కొత్త CEO మనిషి కాదు. ఆయన పెంపుడు కుక్క. దాని పేరు Floki.అంతకు ముందు సీఈవోల కన్నా ఇదే బెటర్ అంటూ పరాగ్ అగర్వాల్‌కు పరోక్షంగా చురకలు అంటించారు మస్క్. 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విటర్‌ను కొన్న మరు క్షణమే అప్పటి CEO పరాగ్ అగర్వాల్‌ను తొలగించారు మస్క్. ఆయన ఒక్కరే కాదు. ట్విటర్ లీగల్ అడ్వైజర్ విజయ గద్దె, CFO నెల్ సెగల్‌నూ తప్పించారు. ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది అనుకుంటే...ఇప్పుడు మరోసారి ఈ ట్వీట్‌తో బయట పడింది. CEO కుర్చీలో తన పెంపుడు శునకం కూర్చున్న ఫోటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు ఎలన్ మస్క్. ఆ శునకం ముందు ఓ టేబుల్ ఉంది. దానిపై ఓ చిన్న ల్యాప్‌టాప్ కూడా ఉంది. కొత్త సీఈవో అర్జెంట్‌గా మెయిల్ చేసే పనిలో ఉన్నట్టుగా ఫోజ్ పెట్టింది ఆ శునకం. ఈ సీఈవో స్టైల్ అదిరిపోయిందంటూ మరో ట్వీట్ చేశారు మస్క్. ప్రస్తుతం ఈ ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.