Differences in Vijay nomination affidavits: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం  అధినేత  విజయ్ తన తొలి ఎన్నికల బరిలో వేసిన నామినేషన్లు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన రెండు నియోజకవర్గాల  చెన్నైలోని పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీకి దిగడమే కాకుండా, ఆ రెండు చోట్లా సమర్పించిన అఫిడవిట్లలో పరస్పర విరుద్ధమైన సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా క్రిమినల్ కేసుల విషయంలో ఆయన వెల్లడించిన వివరాలు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారాయి.                 

Continues below advertisement

విజయ్ తన రాజకీయ అరంగేట్రంలో భాగంగా చెన్నైలోని  పెరంబూరు , తిరుచ్చిలోని  తిరుచ్చి ఈస్ట్   రెండు నియోజకవర్గాల నుండి నామినేషన్లు వేశారు. అయితే, పెరంబూరు నియోజకవర్గంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని  పేర్కొన్న విజయ్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం కోసం సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం తనపై ఒక  కేసు పెండింగ్‌లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు. 2025లో నమోదైన ఒక కేసు వివరాలను తిరుచ్చి అఫిడవిట్‌లో పొందుపరిచి, పెరంబూరులో మాత్రం దాన్ని దాచిపెట్టడం లేదా మర్చిపోవడం ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదమైంది. ఒకే అభ్యర్థి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో వేర్వేరు సమాచారంతో కూడిన అఫిడవిట్లు ఇవ్వడం ఎన్నికల నియమావళి ప్రకారం తప్పిదమని, ఇది ఆయన నామినేషన్ చెల్లుబాటుపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు, ప్రత్యర్థి పార్టీలు విశ్లేషిస్తున్నాయి.                                            ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడం తీవ్రమైన నేరం కావడంతో, ఈ అంశం ఇప్పుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. నామినేషన్లు చెల్లకపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.    విజయ్ ఆస్తుల విలువ *రూ. 625 కోట్లు గా వెల్లడవ్వడం, అందులో తన భార్య సంగీతకు ఆయన ఇచ్చిన రూ. 12.6 కోట్ల అప్పు వివరాలు కూడా ఉండటం చర్చనీయాంశం అయింది.          

విజయ్ 1992లో చెన్నైలోని లయోలా కాలేజీలో బీఎస్సీ డిస్కంటిన్యూ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన గ్యారేజీలో బీఎండబ్ల్యూ i7, టయోటా లెక్సస్ వంటి అత్యాధునిక లగ్జరీ కార్లతో పాటు, ఒక టీవీఎస్ ఎక్స్‌ఎల్  మోపెడ్ కూడా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మొత్తం మీద, తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న విజయ్ ఆస్తుల వివరాలు . వ్యక్తిగత జీవితానికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.