TVK Candidate: తమిళనాడు రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్న దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీకి ఎన్నికల ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఎడప్పాడి నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి అరుణ్ కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో, ఎన్నికల బరిలోకి దిగకముందే ఒక స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయినట్లయింది. నామినేషన్ పత్రాల్లో ఉండాల్సిన కనీస ప్రతిపాదిత 10 మంది సంతకాలు లేకపోవడం వల్ల రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అభ్యర్థి అరుణ్ కుమార్ అదృశ్యం కావడం కలకలం రేపింది. నామినేషన్ల పరిశీలన సమయంలో తాలూకా కార్యాలయం నుంచి బయటకు వెళ్లిన ఆయన, ఆ తర్వాత తిరిగి రాకపోవడమే కాకుండా ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఆయనను ఎవరో కిడ్నాప్ చేశారని . ప్రత్యర్థి పార్టీల ఒత్తిడితోనే ఆయన కనిపించకుండా పోయారంటూ టీవీకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే, తరువాత ఆయన తన ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో గందరగోళం సద్దుమణిగింది.
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం విజయ్ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థి వర్గాల భయంతో, ఇతర ప్రలోభాల వల్ల జంప్ అవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. బలమైన నాయకత్వం, క్షేత్రస్థాయి వ్యూహాలు లేకపోవడం వల్లే ఇలాంటి సాంకేతిక లోపాలు, అభ్యర్థుల అదృశ్యం వంటి సంఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
విజయ్ తన పార్టీని అత్యంత ప్రతిష్టాత్మకంగా బరిలోకి దించుతున్న తరుణంలో, కీలక స్థానాల్లో అభ్యర్థులు ఇలా వెనుకడుగు వేయడం టీవీకే ప్రతిష్టను దెబ్బతీసే అంశంగా మారింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే వంటి బలమైన పార్టీలను ఢీకొనే క్రమంలో, సొంత అభ్యర్థులను కాపాడుకోవడమే విజయ్‌కు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఈ ఘటనపై టీవీకే నాయకత్వం ఎలా స్పందిస్తుందోనన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
