Turkey Earthquake:
3 వేల మంది ఇండియన్స్
టర్కీలో మృతుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో భారత్‌లోనూ టెన్షన్ పెరుగుతోంది. దాదాపు 3 వేల మంది భారతీయులు టర్కీలో ఉన్నట్టు సమాచారం. అయితే వీరెవరూ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో లేరని అక్కడి టర్కీలోని ఇండియన్ అంబాసిడర్ వెల్లడించారు.
"టర్కీలో 3 వేల మంది భారతీయులున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో వాళ్లు లేరు. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. భారతీయులు ఇబ్బందుల్లో ఉన్నారన్న సమాచారమైతే ఇప్పటి వరకూ మాకు రాలేదు"
- వీరందర్ పాల్, టర్కీలోని ఇండియన్ అంబాసిడర్
ఇండియన్ ఆర్మీ టర్కీలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగిస్తోందని చెప్పారు వీరందర్ పాల్. మెడికల్ టీమ్ కూడా అందుబాటులో ఉందని వివరించారు.
"హటాయ్ ప్రావిన్స్‌లో ఇండియన్ ఆర్మీ ఓ ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. రెండు C-17 ఎయిర్ క్రాఫ్ట్‌లలో మెడికల్ టీంతో పాటు మందులూ వచ్చాయి. 30 పడకలతో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేశారు"
- వీరందర్ పాల్, టర్కీలోని ఇండియన్ అంబాసిడర్
ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయని, ప్రజలకు అవసరమైనవి అందించేందుకు అన్ని విధాలుగా భారత్ సహకరిస్తోందని చెప్పారు వీరందర్ పాల్. భారత్‌కు చెందిన NDRF టర్కీ సహాయక చర్యల్లో చాలా యాక్టివ్‌గా ఉంది. 8 ఏళ్ల చిన్నారిని రక్షించేందుకు టర్కీ ఆర్మీతో పాటు గంటల పాటు శ్రమించింది. శిథిలాల చిక్కుకున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.