Laxmi kasula Shobha Yatra: శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్రను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామి వారి పాదాల చెంత లక్ష్మీ కాసుల హారాన్ని ఉంచి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం హారతి సమర్పించి ఆలయం వెలుపలకు తీసుకొచ్చి, తిరుమాడ విధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయని అన్నారు. అమ్మవారు తన ఇష్ట వాహనమైన గజ హవనంపై విహరిస్తూ, ఆలయ మాడ విధుల్లో భక్తులను కటాక్షించనున్నారని తెలిపారు. శ్రీవారి కాసుల హారాన్ని గజవాహనంపై విహరించే అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ అధికారులు వివరించారు. 


గర్భాలయంలో స్వామి వద్ద ఉంచి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చామని... అనంతరం కాసుల హారాన్ని శ్రీవారి ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి తిరుచానూరుకు పంపనున్నామని చెప్పారు. ఈనె 28వ తేదీ పంచమి తీర్థం సందర్భంగా ఆరోజు వేకువజాము అమ్మవారికి సారె తిరుమల నుంచి తీసుకెళ్లనున్నామని చెప్పారు. అశేష సంఖ్యలో భక్తులు పంచమి తీర్థంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపధ్యంలో భారీ ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈనెల 28వ తేదీన పంచమి తీర్థం వేడుకలతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని అన్నారు.


ఈరోజు ఉద పల్లకీ ఉత్సవం పై, రాత్రి గజవాహనంపై, 25వ తేదీన శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడ వాహనం, 26వ శనివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై, 27వ ఆదివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంపై, 28వ తేదీన సోమవారం పంచమీ తీర్థాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అదే రోజు‌ సాయంత్రం‌ ధ్వజావరోహణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించడంతో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని పద్మావతి అమ్మవారి ఆలయం ప్రధాన అర్చకులు బాబు స్వామి తెలిపారు. ఇక పంచ‌మితీర్థం రోజు భ‌ద్ర‌తా విధుల‌కు 2500 మంది పోలీసుల‌ను వాడబోతున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వయంతో భక్తులకు‌ సేవలందించే‌ విధంగా టీటీడీ ఈవో‌ ఏవి.ధర్మారెడ్డి చర్యలు తీసుకున్నారు.


అయితే గత మూడేళ్లుగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా పూర్తిగా నియంత్రణ అయిన కారణంగా ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 20వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో‌ ఈ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి వారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు, మాడ వీధుల్లో రంగులు వేసి, విద్యుత్ దీపాలు, దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేసింది టీటీడీ. తిరుపతి నుండి తిరుచానూరుకి వచ్చే మార్గంలో స్వాగత ఆర్చులు ఏర్పాటు చేశారు. అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు జరుగుతున్నాయి. అలాగే సాయంత్ర వేళల్లో 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతున్నాయి.