TTD forest officials set up cages to trap the leopard:
తిరుమల: అలిపిరి నడక మార్గంలో శుక్రవారం సాయంత్రం బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటనతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. నడక మార్గం భక్తుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడో మైలు నుండి శ్రీ నృసింహా ఆలయం వరకూ హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది. చిరుతను బంధించేందుకు టీటీడీ అటవీశాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు వచ్చే భక్తులను హైఅలర్ట్ గా ప్రకటించిన ప్రాంతంలో 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు ముందు వైపు, వెనుక వైపు రోప్ లు ఏర్పాటు చేసింది.
భక్తులకు సెక్యూరిటి సిబ్బందిని నియామించింది. నడక మార్గంలో కొన్నిచోట్ల ప్రతి పది మీటర్లకు ఓ సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు టీటీటీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 7వ మైలు నుంచి నరశింహస్వామి ఆలయం వరకు భక్తులుకు భధ్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేయడంతో పాటుగా, హై అలర్ట్ ప్రదేశంలో వన్య మృగాలను సంచారంను గుర్తించేందుకు ముప్పై ట్రాప్ కెమరాలను ఏర్పాటు చేశారు. పగటి పూట డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగేవిధంగా టిటిడి చర్యలు చేపట్టింది.
ఏడో మైలు నుండి శ్రీ నరసింహ ఆలయం వరకూ మూడు పులి బోన్లను టిటిడి అటవీ శాఖా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కాలి నడక బాటలో నేటి నుండి తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు విధిస్తూ, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగిందంటే..
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం ఏడు కొండ వేంకటేశ్వర స్వామిని చూసేందుకు వచ్చారు. పదిమంది కలిసి వెళ్తున్నందున కాలినడకన కొండకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. అలిపిరిలోని నడక మార్గంలో రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత వడివడిగా అడుగులు ఆడుతూ పాడుతూ ముందుకెళ్లింది.
సీసీ కెమెరాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఆనందంగా అందరి కంటే చురుగా మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా రాత్రి 11 గంటల సమయానికి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకునే సరికి పాప కనిపించలేదు. రాత్రి వేళలో పాప లక్షిత కనిపించకపోయే సరికి తల్లిదండ్రులతోపాటు వారితో వచ్చిన వారిలో కంగారు మొదలైంది. మొత్తం వెతికారు. పిలిచారు అయినా లక్షిత పలకలేదు. ఏం జరిగిందో ఏమో అనుకున్నారు. వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
పాప కనిపించడం లేదని తెలుసుకున్న టీటీడీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వడివడిగా ముందుకు నడుకుంటూ వెళ్లిన పాపను ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారేమో అన్న కోణంలోనే వేట సాగించారు. ఉదయం చెట్ల పొదల్లో కాలిమార్గంలో డెడ్ బాడీ చూసేవరకు మాత్రం వాళ్లుకు చిరుత దాడి చేసిన సంగతి గమనించలేకపోయారు. చిరుత దాడి చేసే అవకాశం లేదని ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అనుమాన పడ్డారు. దీంతో అందరిలోనూ అనమానాలు కలిగాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిరుత దాడిలో పాప చనిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు.