Hire Buses Strike in Telangana: తెలంగాణలో (Telanagana) శుక్రవారం (జనవరి 5) నుంచి ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. హైర్ బస్సుల యజమానులు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. 'మహాలక్ష్మి' (Mahalaxmi) పథకంలో భాగంగా ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం సహా, ప్రయాణికుల సంఖ్య రెండింతలు అయ్యింది. గతంలో రోజుకు 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆ సంఖ్య 30 లక్షల మందికి చేరింది. దీంతో బస్సుల్లో కాలు పెట్టేందుకు కూడా స్థలం లేక కెపాసిటీకి మించి వెళ్తున్నాయి. ముఖ్యంగా ఎక్స్ ప్రెస్ బస్సులు, గ్రామాలకు వెళ్లే చివరి బస్సుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో బస్సుల కిటీకీల్లోంచి సైతం మహిళా ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఫుట్ బోర్డుల వద్ద సైతం వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయంటూ వాపోయారు. కేఎంపీఎల్ కూడా రావడం లేదని, అందుకే సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్ఎంకు నోటీసులిచ్చారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2,700 అద్దె బస్సులు నడుస్తున్నాయి.


యజమానులు ఏం చెప్తున్నారంటే.?


డిసెంబర్ 9, 2023 నుంచి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తోంది. దీంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో వాహనాల నిర్వహణ భారంగా మారిందనేది బస్సు యజమానుల వాదన. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లడంతో టైర్లు వేడెక్కి పేలే అవకాశం ఉంది. కమాన్ కట్టలపై అధిక లోడు పడి విరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.


ఇవీ డిమాండ్లు


బస్సులకు నూతన టైర్లను బల్క్ రేట్లకే అందించాలని.. కేఎంపీఎంల్ తగ్గించి ఛార్జీలు ఇవ్వాలని అద్దె బస్సు యజమానులు డిమాండ్ చేస్తున్నారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. క్లెయిమ్ కు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.


రూ.10 కోట్ల జీరో టికెట్లు


తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం విజయవంతంగా అమలవుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ స్కీం కింద ఇప్పటివరకూ 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించినట్లు తెలుస్తుండగా, మంత్రులు అధికారులు, సిబ్బందిని అభినందించారు. టీఎస్ఆర్టీసీకి పూర్తి సహకారాలు అందిస్తామని, సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి రోజూ 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు మంజూరు చేస్తున్నామని అధికారులు వివరించారు. సంస్థను బలోపేతానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆలోచిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికెటేతర ఆదాయంపైనా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.


సంక్రాంతికి ప్రత్యేక బస్సులు


మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడిపేలా టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. భాగ్యనగరం నుంచి ఏపీకి రద్దీ దృష్ట్యా 1,450 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. 


Also Read: Sankranthi Holidays: స్కూళ్లకు 'సంక్రాంతి సెలవులు' ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఈ సారి ఎన్నిరోజులంటే?