Telangana News: తెలంగాణలో త్వరలోనే సుదూర ప్రాంతాలకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు TSRTC తెలిపింది. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తుండగా తొలిసారిగామిగతా రూట్లలోనూ ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు TSRTC వెల్లడించింది. ఇప్పటికే 1,860 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చిన సంస్థ వాటిలో కొన్నింటిని డిసెంబర్‌లో వాడకంలోకి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే హరియాణా పల్వాల్‌లో JBM గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణాన్ని ఆర్టీసీ సజ్జనార్ పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను తనిఖీ చేశారు. ఆర్టీసీకి అందిస్తున్న 2 నమూనా బస్సులు పరిశీలించారు. జేబీఎం గ్రూప్‌కి చెందిన ప్రశాంత్‌శర్మతో చర్చించి పలుసూచనలు చేశారు.బస్సుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి అందించాలని సజ్జనార్ విజ్ఞప్తిచేశారు. ప్రయాణికుల సౌకర్యాల్లో రాజీ పడకుండా అత్యాధునిక హంగులతో వాడకంలోకి తీసుకువస్తున్నట్లు సజ్జనార్ వివరించారు.
తెలంగాణలో నాన్ ఏసీ విద్యుత్ బస్సుల్ని రోడ్డు ఎక్కించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. దాదాపు 500 బస్సుల్ని అద్దెకు తీసుకోవాలని కూడా సంస్థ నిర్ణయించింది. తొలిసారిగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ విభాగాల్లో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టనుంది. డిసెంబరు నుంచి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
నిజానికి ఆర్టీసీలో చాలా బస్సులు కాలం చెల్లినవే. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంస్థ కొత్త బస్సుల్ని కొనుగోలు చేయకుండా పాత వాటినే ఉపయోగిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే విద్యుత్ బస్సుల వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఏసీ సర్వీసుల్లో మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులుండగా.. నాన్ ఏసీలోనూ వాటిని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వివిధ సంస్థలకు మొత్తం 1,860 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. వీటిని కూడా అద్దె పద్ధతిలో తీసుకోనుంది. బస్సులు తిరిగిన దూరానికి కిలోమీటర్ల వారీగా చెల్లింపులుంటాయి. వీటిలో 10 విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సుల్ని హైదరాబాద్‌లో నడపనుంది.
సాధారణంగా ఇప్పుడు వాడుతున్న 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అన్నీ హంగులని కలిగి ఉనాయి. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఫోన్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం కూడా ఉంటుంది. ప్రతీ బస్సులోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అద్దెకు తీసుకొనే నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా వీలైనన్ని సదుపాయాలు ఉండేలా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ బస్సులవల్ల వాయు, శబ్ధకాలుష్యం లేకుండా ఉండటంతో పాటూ సౌకర్యవంతమైన ప్రయాణం,అగ్ని నిరోధక వ్యవస్థ, గమ్యస్థానం వివరాలు తెలిపే ఎల్‌ఈడీ బోర్డుల వంటి అధునాతన హంగులుంటాయని ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో వివరించారు.
ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం ఆర్డర్ ఇచ్చిన ప్రకారం వచ్చే రెండు మూడు నెలల్లో వెయ్యి విద్యుత్ బస్సులు రాబోతున్నాయి. వీటిలో కొన్ని బస్సులను మాత్రమే ఏసీగా మార్పు చేసి, మిగిలిన వాటిని నాన్ ఏసీ బస్సులుగా నడిపిస్తారు.