తెలంగాణ ఎన్నికల వేళ ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అదిలాబాద్ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. అవి.. ఆదిలాబాద్‌, బోథ్, ఖానాపూర్. వీటిలో ఖానాపూర్, బోథ్ ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం 1,86,348 మంది ఓట‌ర్లు ఉన్నారు. ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలయిన ఖానాపూర్, బోథ్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కాకుండా... కొత్త వారికి అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్‌. 
 
2014 ఎన్నికల్లో ఆదిలాబాద్, బోథ్‌, ఖానాపూర్ మూడు నియోజవర్గాల్లోనూ గులాబీ జెండా ఎగిరింది. గత రెండు ఎన్నికలను బట్టి చూస్తే... ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌కు కంచుకోట. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన జోగు రామన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపఎన్నికతో కలిపి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు ఆదిలాబాద్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా నాలుగు సార్లు విజ‌యం సాధించి రికార్డు సృష్టించారు జోగు రామ‌న్న. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన జోగు రామ‌న్న హ్యాట్రిక్ విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో 11వేల 710 ఓట్లు మెజార్టీతో జోగు రామ‌న్న గెలిచారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా జోగు రామ‌న్న‌కు 53,705 ఓట్లు రాగా... బీజేపీ అభ్య‌ర్థి పాయ‌ల్ శంక‌ర్‌కు 41,995 ఓట్లు వ‌చ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ త‌ర‌పున‌ జోగు రామ‌న్న నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జోగు రామ‌న్న 74,050 ఓట్లు రాగా.. బీజెపి అభ్య‌ర్థి పాయ‌ల్ శంక‌ర్‌కు 47,444 ఓట్లు వచ్చాయి. బీజెపి త‌ర‌పున పోటీ చేసిన పాయ‌ల్ శంక‌ర్ రెండు ఎన్నికల్లోనూ రెండో స్థానంలోనే నిలిచారు. 2018 ఎన్నికల్లో బీజేపీపై 26వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు జోగురామన్న. 2014, 2018లోనూ విజయకేతనం ఎగురవేసి.. సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఈసారి తానే గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు జోగు రామన్న. ఇక.. బీజేపీ తరపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఓడిపోయిన పాయల శంకర్ ఈసారి ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో నేతలు మాత్రం అంతర్గత కుమ్ములాటతో బిజీగా ఉన్నారు. దీంతో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉన్నా... బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది.


బోథ్‌ ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు టీడీసీ అభ్యర్థులు విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ మూడుసార్లు గెలిచింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నుంచి రాథోడ్‌ బాపూరావు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే..  ఈసారి రాథోడ్ బాపూరావు పక్కనపెట్టి.. బోథ్‌ టికెట్‌ అనిల్ జాదవ్ (ఎస్టీ)కు కేటాయించారు. దీంతో బాపూరావు పార్టీ మారుతారన్న వార్తలు వస్తున్నాయి.


ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్‌ నియోజ‌క‌వ‌ర్గం. ఈ నియోజకవర్గంలో లక్షా 88వేల 158 మంది ఓటర్లు ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖానాయ‌క్ గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో రేఖానాయక్‌కు 38వేల 511 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నిక‌ల్లో రేఖానాయకు 67వేల 442 ఓట్లు రాగా... టీడీపీ అభ్య‌ర్థి రితేష్ రాథోడ్‌కు 28వేల 931 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్‌ల కుమారుడే రితేష్ రాథోడ్. ఇక.. కాంగ్రెస్ పార్టీ 26వేల పైచిలుకు ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది.  2018 కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై రేఖా నాయ‌క్ 21వేల 46 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో రేఖా నాయ‌క్‌కు 66వేల 974 ఓట్లు రాగా, ర‌మేష్ రాథోడ్‌కు 45వేల 928 ఓట్లు వ‌చ్చాయి. అయితే ర‌మేష్ రాథోడ్ మొద‌ట టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఆ త‌రువాత కాంగ్రెస్‌లో చేరి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. కానీ ఓడిపోయారు. ఈసారి  సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్‌ను కాద‌ని..  భూక్యా జాన్స‌న్ రాథోడ్ నాయ‌క్‌కు టిక్కెట్టు ఇచ్చింది బీఆర్‌ఎస్‌. దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన రోజే రేఖానాయక్‌ భ‌ర్త కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల రేఖానాయక్‌ కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.